హైదరాబాద్, ఆంధ్రప్రభ: వర్షాకాలం వచ్చిందంటే ఉగ్రరూపం దాల్చి ప్రజాజీవనాన్ని అతలాకుతం చేస్తున్న గోదావరికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఒకవైపు పోలవరం ముంపు, మరోవైపు ఎగువరాష్ట్రాల్లో కురిసే వర్షాలతో అతలాకుతలమవుతున్న భద్రాచలంను కాపాడుకునేందుకు రక్షణ గోడలతో పాటుగా పలు నిర్మాణాత్మకమైన కార్యక్రమాలను చేపట్టేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.1,629 కోట్లు మంజూరు చేసి శాస్త్రీయమైన అధ్యయనం చేస్తోంది. ముంపు నివారణకోసం అవసరమైతే నిధులు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే పోలవరం బ్యాక్ వాటర్ ముంపు అత్యధికంగా ఉన్నప్పటికి పోలవం ప్రాజెక్టు అథారిటీ స్పందించక పోవడంతో గత సంవత్సరం జులై, ప్రస్తుత సంవత్సరం జులైలో వరద ముంపుతో ప్రజలు తల్లడిల్లారు. పరిస్థితిని స్వయంగా సమీక్షించి సీఎం కేసీఆర్ యుద్ధప్రాతిపదికన ముంపు నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లోని జనావాసాలను ఎగువకు తరలించి శాశ్వత గృహవసతి కల్పించేందుకు రూ.వేయి కోట్లతో ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
గోదావరి వరదలు వరుసగా సంభవించడానికి ప్రధాన కారణం పోలవరం ఎత్తు పెంచి, గేట్లు బిగించడమేనని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీకీ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాసినా సమాధానం లేదు. ముంపు నివారణ చర్యలకు ముందుకు రావడంలేదు. ఫలితంగా ముంపుకు గురయ్యే ప్రాంతాలను రక్షించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తోంది. భద్రాచలం పట్టణం, దేవాలయాన్ని కాపుడుకుంటూ భద్రాచలం కుడివైపు బూర్గంపాడు మండలం, సంజీవరెడ్డి పాలెం నుంచి అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి వరకు, ఎడమవైపు భద్రాచలం మండలం సుభాష్‌నగర్ నుంచి దుమ్ముగూడెం మండలం సున్నంబట్టీ గ్రామం వైపు సుమారు 20 కిలోమీటర్ల రక్షణ గోడలు నిర్మించేందుకు నిపుణుల కమిటీ అంచనావేసింది. అలాగే మణుగూరు భారజల కేంద్రం ముంపుకు గురికాకుండా శాశ్వత చర్యలను పెట్టేందుకు ప్రత్యేకంగా డీపీఆర్ రూపొందిస్తున్నారు. వీటితో పాటుగా మైనర్, మీడియం క్రాస్ డ్రైనేజ్ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. అయితే ఒడిశా, చత్తీస్‌గఢ్, ఏపీ ప్రభుత్వాల ప్రతినిధులతో కలిసి పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఉమ్మడి సర్వే చేయాల్సి ఉండగా ఇప్పటివరకు స్పందన లేకపోవడంతో తెలంగాణ ప్రభుత్వంలోని భూభాగాలను కాపాడుకునేందుకు సిద్ధమైంది. గోదావరి వరదల సమయంలో పోలవరం గేట్లు ఎత్తివేస్తే కొంతమేరకు వరద ప్రభావం తగ్గించే అవకాశాలున్నా ఆమేరకు ఏపీ సహకరించకపోవడంతోనే సమస్య తీవ్రమ వుతోందని నిపుణుల కమిటీ తేల్చింది.
నిధులు సిద్ధం చేయడంతోపాటు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర నీటి పారుదల నిపుణుల బృందం ఈఎన్సీ ఆపరేషన్ అండ్ మెయింటెన్స్ నాగేందర్ రావు అధ్యక్షతన ఇంజనీరింగ్ నిపుణుల బృందం గత నాలుగు రోజులుగా బ్రహ్మపుత్ర, మహానది తీరప్రాంతాల్లో వరదల ముంపుకు తీసుకున్న చర్యలపై క్షేత్రస్థాయి అధ్యయనం చేసింది. అలాగే దేశంలోని ప్రధాన నదుల పరివాహక ప్రాంతాలతో పాటుగా గంగా తీరప్రాంతాల్లో ఈ నిపుణుల బృందం పర్యటించనుంది. త్వరలో గంగా నది పరివాహక ప్రాంతాల్లో పర్యటించి రాష్ట్రంలో గోదావరి ముంపు ప్రాంతాల రక్షణకోసం ప్రత్యేక డీపీఆర్ రూపొందించనున్నట్లు అధికారులు చెప్పారు. ఇం దులో భాగంగా రాష్ట్రంలో గోదావరిలో కలిసే 37 ప్రవాహాలకు అడ్డుకట్టలు, చెక్ డ్యాంలు, జలాశయాలు నిర్మించే ప్రతిపా దనలను కూడా పరిశీలిస్తున్నారు. రాబోయే వర్షాకాలం నాటికి ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలిస్తోందని ఇంజనీరింగ్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.