Friday, November 22, 2024

TS | కొత్త రైతులకు రైతు బీమా .. ఆగస్టు 5 వరకు దరఖాస్తులకు గడువు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఏటా భూ క్రయ విక్రయాలు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో కొత్తగా భూమిని కొనుగోలు చేసిన రైతులకు రైతు బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వర్తింప చేస్తోంది. ఇందుకు జులై 10 నుంచి అర్హులైన కొత్త రైతుల నుంచి రైతు బీమా పథకానికి దరఖాస్తులు స్వీకరిస్తోంది. రైతు బీమా కోసం దరఖాస్తులను ఆగస్టు 5 వరకు స్వీకరించనున్నారు. కొత్తగా అర్హులైన రైతులందరినీ ఈ ప్రయోజనకరమైన పథకంలో చేర్చాలని వ్యవసాయ శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణలోని రైతుల సంక్షేమం, శ్రేయస్సు కు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తున్న నేపథ్యంలో కొత్త రైతులకు ఈ అవకాశాన్ని ఇచ్చింది.

- Advertisement -

పంట నష్టపోయిన సమయంలో రైతులు ఎదుర్కొనే భారాలను తగ్గించడం, వారు ప్రతికూల పరిస్థితుల నుండి పుంజుకోవడానికి అవసరమైన వనరులను అందించాలన్న లక్ష్యంగా భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా కింద కొత్త దరఖాస్తులను స్వీకరిస్తోందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అర్హులైన రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆగస్టు 5 వరకు రైతు బీమా పథకం కోసం రిజిస్ట్రేష్రన్‌ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. రైతు బీమా పథకం కింద లబ్ది పొందాలంటే 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల రైతులు అర్హులు.

తాజాగా రైతుబీమా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే రైతులు జూన్‌ 18వ తేదీకి ముందు పొందిన పట్టాదారు పాస్‌బుక్‌ని కలిగి ఉండాలి. రైతు ఏ కారణం చేతనైనా అకాల మరణం చెందితే రైతు బీమా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధిత కుటుంబాన్ని ఆదుకుంటోంది. చివరకు గుంట భూమి ఉన్న రైతుకు రైతు బీమా పథకాన్ని వర్తింప చేస్తోంది. రైతు బీమా పథకానికి అర్హుడు కావాలంటే రైతు అయితే చాలు. ఆదాయపరిమితి, ఇతరత్రా అంశాలతో నిమిత్తం లేకుండా 18 నుంచి 60 సంవత్సరాల లోపు రైతులు చనిపోతే రైతుబీమా పథకం కింద బాధి త కుటుంబం రూ.5లక్షలు పొందుతోంది. రైతు బీమా కోసం రైతుల తరుపున ప్రీమియాన్ని ఎల్‌ఐసీ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది

Advertisement

తాజా వార్తలు

Advertisement