హైదరాబాద్: రాష్ట్రంలో పదకొండో విడుత రైతుబంధు పంపిణీ ప్రారంభమైంది. సోమవారం తెల్లారేసరికి రైతుబంధు నిధులతో రైతన్నల మొబైల్స్ మోగిపోయాయి. పొద్దుపొద్దున్నే వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే అన్నదాతలకు అదే సమయంలో తెలంగాణ సర్కార్ రైతుబంధు నిధులను వారి ఖాతాల్లో జమచేసి సంతోషాన్ని నింపింది. రైతుబంధు నిధులు తమ ఖాతాల్లో జమ అయినట్లు వచ్చిన మెసేజ్‌లను చూసి రైతులు మురిసిపోయారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు ( అన్నదాతలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నారు. పంటపొలాల్లో ఆయన చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు. రైతుల పాలిట దేవుడు కేసీఆర్ అని ప్రశంసిస్తున్నారు.
రైతు బంధు పంపిణీలో భాగంగా తొలిరోజైన నేడు గుంట భూమి నుంచి ఎకరం విస్తీర్ణం గల భూయజమానులు 22,55,081 మంది రైతుల ఖాతాల్లో రూ.642.52 కోట్ల నగదు జమ అయింది… ఈ సీజన్‌లో 1.54 కోట్ల ఎకరాలకుగానూ 70 లక్షల మంది రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించనుంది. గతంతో పోల్చితే ఈ సీజన్‌లో 5 లక్షల మంది రైతులకు కొత్తగా రైతుబంధు అందిస్తున్నది. రైతులు, భూ విస్తీర్ణం పెరగడంతో ఈ సీజన్‌లో రైతుబంధు కోసం రూ.7,720.29 కోట్లు ఖర్చు చేయనుంది. గతంతో పోల్చితే ప్రభుత్వంపై సుమారు రూ.300 కోట్ల అదనపు భారం పడుతున్నది. ఈ సీజన్‌తో కలిపితే రైతుబంధు ద్వారా రూ.72,910 కోట్లు రైతుల ఖాతాల్లో జమయినట్లవుతుంది. కాగా, సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు 1.5 లక్షల మంది పోడు రైతులకు చెందిన 4 లక్షల ఎకరాలకు కూడా రైతుబంధు సాయం అందించనున్నారు.