ప్రమాదం అని తెలిసినా ఆటోలో ప్రయాణం
అవస్థలు పడుతున్న ప్రజలు, విద్యార్థులు
పలు గ్రామాలకు నడవని బస్సులు
విన్నవించినా మారని అధికారుల తీరు
కొనసాగుతున్న ధర్నాలు, రాస్తారోకోలు
కాలినడకనే పాఠశాలలకు విద్యార్థులు
ఉచిత ప్రయాణమే మసకబారనుందా..?
ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : అట్టహాసంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామంటూ ప్రభుత్వం వైపు నుండి ప్రచారం తారాస్థాయికి చేరుకుంటుంటే అసలు ఆ ప్రయాణమే పొందని గ్రామీణ మహిళలు ఉండడం శోచనీయంగా మారింది.. పల్లె వెలుగు పేరుతో ఆర్టీసీ అందిస్తున్న సేవలు ప్రస్తుతం కొన్ని గ్రామాలకే పరిమితమవుతున్నాయి.. దీంతో ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది..
పల్లె వెలుగు బస్సులను గ్రామానికి నడపని అధికారుల తీరుతో మహాలక్ష్మి పథకానికి తూట్లు పడి ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుంది.. మహిళలే కాకుండా కళాశాల, పాఠశాల విద్యార్థులు ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.. మహిళలందరికీ ఉచిత ప్రయాణ రాయితీ కల్పిస్తామన్న ప్రభుత్వ ఉదాత్త ఆశయం నిర్లక్ష్యం మాటున ఇంకొంత కాలం అటకెక్కనుందా..? అనే సందేహాలు కూడా మొదలయ్యాయి.. ప్రమాదం అని తెలిసినా గత్యంతరం లేక ప్రజలు ఆటోలలోనే రాకపోకలు సాగిస్తున్నారు. తమ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బస్సుల కోసం విద్యార్ధుల రాస్తారోకోలు..
పలు గ్రామాల్లో నుంచి విద్యార్థులు మండల కేంద్రాలు, పట్టణాలకు చదువు కోవడం కోసం వెళ్తున్నారు. కొన్ని గ్రామాల్లోకి పల్లె వెలుగు బస్సు కానరాదు. మరికొన్ని గ్రామాల్లో కేవలం ఒక్కసారి మాత్రమే వస్తుంది. చదువులు పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లేందుకు బస్సులు సకాలంలో రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల కోసం అనేక సందర్భాల్లో విద్యార్థులు రాస్తారోకో, ధర్నాలు చేసారు. కిక్కిరిసిన ప్రయాణికులతో బస్సుల్లో వెళ్లాలంటేనే భయపడుతున్నారు. కొన్ని గ్రామాల్లో విద్యార్థులు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ప్రమాదం అని తెలిసినా ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఆటోల్లో పాఠశాలలకు వెళ్తున్నారు. ప్రభుత్వం స్పందించి ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.
ఉచిత బస్సు ప్రయాణం మాకు లేదా..?
రాచకొండ కమిషనరేట్ పరిధి నారాయణపురం మండలంతో పాటు పలు మండలాల్లో పల్లెలు, గిరిజన గ్రామాలకు ఇప్పటికీ సరైన బస్సు సౌకర్యం లేదు. ఎటుచూసినా కొండలు, గుట్టలు, అడవులు ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోట ఈ ప్రాంతం బాహ్య ప్రపంచంతో అక్కడి గ్రామాలకు ఎలాంటి సంబంధం ఉండేది కాదు. గతంలో కొండలు, గుట్టలు ఎక్కుతూ గిరిజనులు రాకపోకలు సాగించేవారు. అలాంటి గిరిజన గ్రామాలకు స్వాతంత్ర్యం వచ్చిన 77ఏళ్లకు ఐదు దోనలతండకు అప్పటి సీపీ మహేష్ భగవత్ సాకారంతో రాచకొండను దత్తత తీసుకుని రోడ్డు వేయించి బస్సు సర్వీసు ప్రారంభించారు. 2020 కరోనా సమయంలో బస్సు సర్వీసు రద్దు చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా బస్సు సౌకర్యం లేదు. నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఆ తండాలో గిరిజనులు 200మందికి పైగా జీవనం సాగిస్తున్నారు. అక్కడి గిరిజన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లేనట్టే.
పల్లె వెలుగు చూడని గ్రామాలెన్నో..
యాదాద్రి భువనగిరి జిల్లాలోని 17మండలాలు, 6మున్సిపాలిటీలు, 421గ్రామాలు, 229అవాస గ్రామాలు ఉన్నాయి. స్వాతంత్రం వచ్చి 77ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఆర్టీసీ బస్సు సౌకర్యం లేని కొన్ని గ్రామాలు ఉన్నాయి. నూతనంగా ఏర్పడిన కొన్ని గ్రామపంచాయతీలతో పాటు మరికొన్ని ఆవాస గ్రామాల్లోనూ పల్లె వెలుగు బస్సులు నడపడం లేదు. బస్సులు రాకపోవడంతో విద్యార్థులు కాలినడకన, ప్రైవేటు ఆటోల్లో వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సుమారు జిల్లాలో 20శాతం గ్రామాలకు కూడా పల్లె వెలుగు బస్సులు నడపడం లేదు. మరో 20శాతం గ్రామాల్లో ఉదయం, సాయంత్రం మాత్రమే ఒక్కసారి వెళుతున్నాయి. జిల్లాలోని పలు మండలాల్లోని గ్రామాలు మల్లగూడెం, కొత్తజాల, నర్సాపురం, దూదివేంకటాపురం, చిమిర్యాల, శేరీ గూడెం, వావిళ్ళ పెళ్లి, గోపాల్ పురం నాగయిపల్లి, నాగయిపల్లి తండా, చిన్నలక్ష్మపురం, కొండాపూర్, శ్రీనివాస్ పురం, రాగిబావి, పనక బండ, ముషిపట్ల, సదర్శాపూర్, దాచారం, పీపల్ పహాడ్, అల్లాపురం, ఆరెగూడెం, పంతంగి, చింతలగూడెం, మందోల్లగూడెం, కుంట్లగూడెం, నేలపట్ల, మసీదుగూడెం, మునిరాబాద్, తిరుమలగిరి, కేకే తండా, గోవింద్ తండా, పీజీ తండాతో మరికొన్ని గ్రామాల్లో పల్లె వెలుగు బస్సులు నడవడం లేదు. మరికొన్ని గ్రామాల్లో ఉదయం, సాయంత్రం ఒక్కసారి మాత్రమే వస్తున్నాయి.
బస్సుల కోసం ఎమ్మెల్యే కుంభం రివ్యూ..
భువనగిరి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆర్టీసీ అధికారులతో ప్రత్యేక రివ్యూ సమావేశం నిర్వహించారు. యాదగిరిగుట్ట, భువనగిరి, నార్కట్ పల్లి, నల్గొండ, జనగాం, హయత్ నగర్, చెంగుచెర్ల, కంటోన్మెంట్, ఉప్పల్, రీజనల్, డిపో మేనేజర్లతో క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. కొన్ని గ్రామాల్లో పాఠశాలలకు విద్యార్థులు వెళ్ళెందుకు, ప్రజలు పట్టణ కేంద్రాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. భువనగిరి, వలిగొండ, పోచంపల్లి, బీబీనగర్ మండలాల్లో ప్రతి గ్రామానికి పల్లె వెలుగు బస్సు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సానుకూలంగా స్పందించిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఆలస్యం కాకుండా అన్ని గ్రామాలకు బస్సులు త్వరగా పంపేలా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.
బస్సుల్లో ప్రయాణించడం నరకమే
ఎడ్ల బాలలక్ష్మి, భారాస మహిళ అధ్యక్షురాలు- రాజాపేట
ప్రభుత్వం మహాలక్ష్మీ పథకంలో భాగంగా ప్రవేశ పెట్టిన ఉచిత బస్సు ప్రయాణం కొన్ని గ్రామలకే పరిమితమైంది.ఉచిత ప్రయాణం ప్రవేశ పెట్టి బస్సులను తగ్గించింది. బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. బస్సులు వచ్చిన బస్సుల నిండా ప్రయాణికులు ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. బస్సుల్లో ప్రయాణించాలంటేనే ప్రత్యక్ష నరకంలా తలపిస్తుంది.. బస్సుల సంఖ్యను పెంచితేనే పథకానికి సార్ధకత లభిస్తుంది..
బస్సు రద్దు చేసి ఎనిమిదేండ్లు
రాంపాక బక్కమ్మ, మాజీ సర్పంచ్,
పనకబండ – రాగి బావి గ్రామం
మోత్కూర్ మండలం రాగిబావి గ్రామం పనకబండ గ్రామ పంచాయతీ పరిధిలో తమ గ్రామం ఉన్నప్పుడు బస్సు వచ్చేది. ప్రత్యేక గ్రామ పంచాయతీ అయిన తర్వాత బస్సు రావడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినప్పటికీ తమ గ్రామానికి బస్సు రాక ఉచిత ప్రయాణం సద్వినియోగం చేసుకోవడం లేదు. హైదరాబాద్ కి వెళ్లాలంటే తమ ఊరి నుండి ఆటోలు, ట్రాక్టర్, బైక్ లపై మోత్కూర్ కి వెళ్లాల్సి వస్తుంది. అక్కడి నుండి హైదరాబాద్ కు వెళ్తున్నాము. మా గ్రామానికి బస్సు కావాలని గతంలో ఆర్టీసీ డిపో మేనేజర్ కి విన్నవించాము. కానీ అధికారులు పట్టించుకోవడం లేదు.
కొన్ని గ్రామాలకే పల్లె వెలుగు బస్సులు
పలుగుల ఉమారాణి, మాజీ వైస్ ఎంపిపి – తుర్కపల్లి
తెలంగాణ ఆర్టీసీ అందిస్తున్న సేవలు ప్రస్తుతం కొన్ని గ్రామాలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొన్నది. ప్రైవేటు ప్రయాణాలు అన్నివేళలా సురక్షితంగా సాగడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరగడంతో పాటు ఆటోలలో కిక్కిరిసిన ప్రయాణికులతో జాగ్రత్తలు లేకుండా ప్రయాణం చేస్తుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ప్రధానంగా పల్లెలకు ఆర్టీసీ బస్సులు రాకపోవడం వలన, ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం చేయాల్సి వస్తుంది.. ప్రమాదం అని తెలిసినా తప్పని పరిస్థితి..
ఒక్క బస్సు రావడంతో ఇబ్బందులు
కొలిపాక అంజలి, విద్యార్థి, పకీరుగూడెం – బొమ్మలరామారం
గ్రామానికి ఒక్క రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.. సమయానికి రాకపోవడంతో కళాశాలకు ఆలస్యంగా వెళ్లుతున్నాం.. భువనగిరి నుండి తిరిగి ఇంటికి చేరేందుకు బస్సు ఆలస్యం రావడంతో బస్టాండ్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. సెలవు దినాల్లో, ఆదివారాల్లో బస్సు సౌకర్యం లేదు. కళాశాలలో ప్రత్యేక తరగతులు ఉంటే ప్రయివేటు వాహనాల్లోనే వెళ్తున్నాము. అధికారులు కనీసం రెండు బస్సులు వేసి సమస్యలు పరిష్కరించాలి.