ఈనెల 16నుంచి 19వ తేదీ వరకు జరగనున్న ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఆదివాసి గిరిజన జాతర మేడారం జాతర. అయితే ప్రసిద్ధ మేడారం సమ్మక్క సారక్క జాతర కోసం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక యాప్ ను రూపొందించిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. మేడారం విత్ టిఎస్ ఆర్టీసీ పేరుతో ప్రత్యేక యాప్ ను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చామని ఆయన పేర్కోన్నారు. ఆర్టీసీ చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా యాప్ రూపొందించామని సజ్జనార్ చెప్పారు. మేడారం జాతర సందర్భంగా గతేడాది 19,09,838 మందిని వివిధ గమ్యస్ధానాలకు చేర్చామని సజ్జనార్ వివరించారు. ఈ ఏడాది ఇంతవరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 523 బస్సులను 1,250 ట్రిప్పులను మేడారానికి నడిపామని అన్నారు.
ఈనెల 13 నుంచి పెరిగే భక్తల రద్దీని తట్టుకునేందుకు బస్సులు సిధ్దం చేశామని, 30 మంది ప్రయాణికులుంటే వారి కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. మేడారంలో 50 ఎకరాల్లో బేస్ క్యాంపు, తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేసామని..7,400 మీటర్ల క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు సజ్జనార్ వివరించారు. వరంగల్ నుంచి 2 వేల బస్సుల్లో కండక్టర్ లేకుండా సర్వీసులు నడిపిస్తున్నామని ఆయన అన్నారు. అమ్మవార్ల గద్దెల వరకు ఆర్టీసీ బస్సులు నడుస్తాయని.. అమ్మవారి దర్శనం తొందరగా అయ్యేందుకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు. మేడారం లో ఉచిత షటల్ సర్వీసులు అందుబాటులో పెట్టామని ఆర్టీసీ ఎండీ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..