Saturday, November 23, 2024

ఆర్టీసీ ఇప్పుడిప్పుడే బాగుపడుతోంది, కొత్త బస్సులు కొనేందుకు యత్నిస్తున్నాం: పువ్వాడ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఆర్టీసీ ఇప్పుడిప్పుడే బాగు పడుతుంది. బస్సులను కొనేందుకు చర్యలు తీసుకుంటున్నాం. హైదరాబాద్‌ నగరంలో డబుల్‌ డెక్కర్‌ బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ తెలిపారు. ప్రయాణికుల అవసరాల మేరకు ఆర్టీసీ బస్సులను నడుపుతున్నామని చెప్పారు. శనివారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా జీహెచ్‌ఎంసీ, ఇతర జిల్లాల్లో ఆర్టీసీ బస్సుల సౌకర్యంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు పువ్వాడ సమాధానమిచ్చారు. 2014లో రాష్ట్ర వ్యాప్తంగా 9,800 బస్సులు తిరిగితే.. 2022లో 9,057 బస్సులు తిరుగుతున్నాయని తెలిపారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో నాడు 3,554 బస్సులు అందుబాటులో ఉంటే ప్రస్తుతం 2,865 బస్సులు నడుపుతున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో మినీ బస్సులు నడిపేందుకు పరిశీలన చేస్తామన్నారు. డీజిల్‌ ధరలు భారీగా పెరిగినందునే మినీ బస్సులను నడపట్లేదని స్పష్టం చేశారు. మినీ బస్సుల్లో ప్యాసింజర్‌ కెపాసిటీ కూడా తక్కువగా ఉందన్నారు. ఈ క్రమంలో ప్రయాణికులకు వీలుగా ఉండేందుకు పెద్ద బస్సులను నడుపుతున్నామని తెలిపారు. ములుగు కొత్త జిల్లా అయినందున అక్కడ బస్‌ డిపో, బస్టాండ్‌ ఏర్పాటుకు పరిశీలిస్తున్నామని చెప్పారు. మేడారం జాతరలో రూ. 11 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. 2763 బస్సుల్లో 11 లక్షల మంది ప్రయాణికులను తరలించామని పువ్వాడ పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement