హైదరాబాద్, ఆంధ్రప్రభ: టీఎస్ ఆర్టీసీకు ఈసారి రాఖీ పండుగ కలిసొచ్చింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ ఆదాయం రూ.20 కోట్లు అర్జించింది. శుక్రవారం ఒక్క రోజే ప్రత్యేక సర్వీసులను నడిపి 45 లక్షల మంది ప్రయాణికులను గమస్యస్థానాలకు చేర్చి రికార్డు నెలకొల్పింది. ఈస్థాయిలో ఆదాయం వచ్చేలా ఆర్టీసీ సేవలను ప్రయాణికులు వినియోగించుకున్నందుకు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాఖీ రోజు అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ఆత్మీయ కలయికకు సంస్థ తన పాత్రను పోషించిందని, వారి మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడంలో సహాయపడిందన్నారు. ఆర్టీసీ సంస్థను ప్రజలు మరింత ఆదరించి, సంస్థ సేవలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రయాణికులకు మరిన్ని రాయితీలతో కూడిన పథకాలు ప్రవేశపెడతామని ఆయన వెల్లడించారు.
భారీ రద్దీ దృష్ట్యా ప్రయాణీకులకు కొంత అసౌకర్యం కలిగినందుకు విచారిస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవల్ని 7వేల మంది వినియోగించుకున్నట్లు తెలిపారు. ఈ ఆగస్టు 15న పుట్టబోయే బిడ్డకు 12 సంవత్సరాలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నామని మరోసారి స్పష్టం చేశారు. ఇంకా కార్గో, బస్సు సర్వీస్‌లలో అనేక రాయితీలను కల్పిస్తున్నట్లు వివరించారు. సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి అన్ని విధాలుగా అండగా ఉంటామని సంస్థ ఛైర్మన్ హామీ ఇచ్చారు. ప్రజల సహకారంతో ఆర్టీసీ సంస్థను పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలందరూ ఆర్టీసీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.