Saturday, November 23, 2024

ప్రైవేటుకు ధీటుగా ఆర్టీసీ.. కార్యక్రమాల ప్రచారానికి కళాబృందాలు

హైదరాబాద్‌, (ఆంధ్రప్రభ) : ప్రయాణికులకు మరింత చేరువయ్యే క్రమంలో… సంస్థ చేపడుతోన్న కార్యక్రమాలకు మరింత విస్తృత ప్రచారాన్ని కల్పించేందుకుగాను కళాబృందాలను ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సజ్జనార్‌ వెల్లడించారు. అదే సమయంలో రవాణా సేవల విస్తృతికిగాను ప్రజాదరణ అత్యంత ప్రాధాన్యమైన అంశమని పేర్కొన్నారు. ఆర్టీసీ అమలుచేస్తోన్న పథకాలు, సేవలు, ఇతరత్రా కార్యక్రమాలను ప్రచారం చేసేందుకుగాను సంస్థ అమలుచేస్తోన్న కార్యక్రమాలను కళాబృందాల ద్వారా ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళుతున్నట్లు తెలిపారు. సంస్థ ప్రచార రథాన్ని గురువారం ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

టీఎస్సార్టీసీ ఎప్పటికప్పుడు మరింత మెరుగైన రీతిలో సేమలనందించేందుకు ప్రయాణికుల సహకారం కూడా అవసరమని సజ్జనార్‌ ఈ సందర్భంగా అన్నారు. సంస్థ అందిస్తోన్న రాయితీలు, సౌకర్యాలు, పథకాలు, సేవలకు సంబంధించి ప్రస్తావిస్తూ… ఇవి ఎంత ముఖ్యమో, ప్రజాదరణ కూడా అంతే ముఖ్యమని, ఈ రెండు అంశాలూ పక్కాగా ఉన్నప్పుడే సంస్థ అభివృద్ధి సాధ్యపడుతుందని పేర్కొన్నారు. సంస్థ సేవలకు సంబంధించి విస్తృత ప్రచారాన్ని కల్పిచే క్రమంలో ప్రత్యేకంగా రూపొందించిన కళాబృందాలు, వాహనం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తిరగనున్నట్లు తెలిపారు. ముందస్తుగా హైదరాబాద్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌, కరీంనగర్‌ జోన్లలొ తమ కళాబృందాలు… పర్యటనలు, ప్రదర్శనలను నిర్వహిస్తాయని చెప్పారు. సంస్థ ఛీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ రవీందర్‌, గ్రేటర్‌ జోన్‌ ఎగ్జ్సిక్యూటివ్‌ డైరెక్టర్‌ యాదగిరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా పథకాల ప్రచారానికిగాను కళాబృందాలను ఏర్పాటు చేయడమన్నది కొత్త ఒరవడి అని, ఇక… రానున్న రోజుల్లో కూడా మరిన్ని బృందాలు ఏర్పాటవుతాయని తెలిపారు.

గత కొన్ని దశాబ్దాలుగా నష్టాలబాటలో పయనిస్తున్న ఆర్టీసీని లాభాల బాటలోకి మళ్ళించేందుకు యాజమాన్యం, ప్రభుత్వం తారస్థాయిలో చేస్తోన్న కృషి రానున్న రోజుల్లో సత్ఫలితాలనివ్వనున్నట్లు భావిస్తున్నామని సపజ్జనార్‌ ఈ సందర్భంగా విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక ప్రైవేటు బస్సులు, సంస్థలకు ధీటైన రీతిలో సంస్థను తీర్చిదిద్దేందుకు పూర్తిస్థాయి చర్యలను చేపడుతున్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో ప్రయాణికులనుంచి కూడా సహకారం అవసరమని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement