స్వల్ప గాయాలతో బయటపడిన ప్రయాణికులు
జోగిపేట, నవంబర్29 (ఆంధ్రప్రభ): అందోల్ మండల పరిధిలోని కన్ సానిపల్లి జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో నారాయణఖేడ్ నుంచి సంగారెడ్డి వైపు వస్తున్న క్రమంలో కన్ సానిపల్లి వద్దకు రాగానే అదుపుతప్పి జాతీయ రహదారిపై ఉన్న డివైడర్ పైకి దూసుకెళ్లింది. డివైడర్ పైన కాస్త బస్సు ముందుకు వెళ్ళింది. బస్సులో అప్పటికే 50మందికి పైగా ప్రయాణికులు బస్సులో ప్రయాణిస్తున్నారు. జరిగిన ప్రమాదంలో సుమారు 20మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, మిగతా ప్రయాణికులు సురుక్షితంగా బయట పడ్డారు.
గాయాలైన ప్రయాణికులను వెంటనే చికిత్స నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ డ్రైవర్ అజాగ్రత్తగా, అతివేగంగా బస్సును నడపడం వలనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రయాణికులు అన్నారు.
సంఘటన స్థలానికి చేరుకున్న జోగిపేట ఎస్ఐ…
కన్ సానిపల్లి వద్ద జరిగిన ప్రమాదం తెలుసుకున్న జోగిపేట ఎస్ఐ పి.పాండు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాదంలో గాయాలై చికిత్స పొందుతున్న ప్రయాణికుల వివరాలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో బస్సు ప్రమాదంలో గాయాలైన ప్రయాణికులకు మెరుగైన వైద్యులు వైద్య చికిత్సలు అందిస్తున్నారు.