Friday, November 22, 2024

బీఎస్పీ చీఫ్‌గా బాధ్య‌త‌లు తీసుకున్న‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌.. వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరే!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన ఆర్‌. ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు ఆయన పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా పని చేశారు. ఈనెల 7న ఢిల్లి వెళ్ళిన ప్రవీణ్‌ కుమార్‌ పార్టీ అధినేత్రి మాయావతితో తెలంగాణలో బీఎస్పీ బలోపేతంపై చర్చించారు. ఢిల్లి నుంచి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ చేరుకున్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఇన్‌చార్జ్‌ ఎంపీ రాంజీగౌతమ్‌, పార్టీ కార్యకర్తల సమక్షంలో బాధ్యతలను స్వీకరించారు. తెలంగాణ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా పనిచేని సమర్ధవంతుడిగా పేరు తెచ్చుకున్నారు. కొద్ది నెలల క్రితం ఆ పదవికి రాజీనామా చేసి బీఎస్పీలో ఆయన చేరారు.

పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లో పాదయాత్రలు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. బహుజనులకు రాజ్యాధికారం పట్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సేవలను గుర్తించిన బీయస్పీ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమించింది. ఈ సందర్భంగా ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో బహుజనుల అభివృద్ధి కోసం ఎంతటి త్యాగానికైనా తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. పార్టీ అధినేత్రి మాయావతి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోకుండా ఒంటిగానే పోటీ చేస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజలు తీవ్ర కష్టాల్లో ఉన్నారని, దోపిడి పాలకుల నుంచి విముక్తి కల్పించడానికి బీయస్పీ కృషి చేస్తుందన్నారు.

తెలంగాణ పోరాటంలో త్యాగాలు ఒకరివైతే, భోగాలు మరొకరివని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల బిడ్డలు చదువుల కోసం ప్రాకులాడుతుంటే, బడాబాబులు విలాసవంతమైన కార్లలో తిరుగుతున్నారని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్‌ ఫాంహౌస్‌ నుంచి ప్రగతి భవన్‌కు తిరగడానికి సంవత్సరానికి రూ.79 లక్షల ఖర్చు చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రాన్ని ప్రజా తెలంగాణగా మార్చడమే బీయస్పీ లక్ష్యమని ఆయన తెలిపారు. బీఎస్పీ చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర రాష్ట్రంలోని 650 గ్రామాల్లో కొనసాగిందన్నారు. మరో 300 రోజుల పాట రాష్ట్ర వ్యాప్తంగా యాత్రను కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement