నిర్మల్ ప్రతినిధి, సెప్టెంబర్ 23, (ప్రభ న్యూస్) : నిర్మల్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం రూ.50 కోట్ల టి.యు.ఎఫ్.ఐ.డి.సి నిధులను కేటాయించిందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ పట్టణాభివృద్ధికి రూ.50 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ప్రజల తరపున కృతజ్ఞతలు చెప్పారు. నిర్మల్ మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో బీఆర్ఎస్ శ్రేణులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అడిగిన వెంటనే నిర్మల్ పట్టణాభివృద్ధికి రూ.50 కోట్ల నిధులను కేటాయించారన్నారు. నిర్మల్ పట్టణాభివృద్ధికి నిధులు మంజూరు చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రత్యేక నిధులు మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంతో ఊతమిస్తాయన్నారు. సమగ్ర ప్రణాళికతో నిధులను సద్వినియోగం చేసుకుంటామన్నారు. ఈ నిధులతో ప్రజలకు కనీస మౌలిక వసతులను కల్పించడంతో పాటు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రతి వార్డుకు సీసీ రోడ్డు, డ్రైన్లు, కమ్యూనిటీ హాళ్లు, పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ రాజీపడకుండా విడుదల చేసిన నిధులతో అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తామని వివరించారు.
ఈ నిధులతో రూ. 9.80 కోట్లతో 42వార్డుల్లో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, రూ.5 కోట్లతో నూతన పురపాలక భవన నిర్మాణం, రూ.4 కోట్లతో ఎన్టీఆర్ స్టేడియంలో ఇండోర్ స్టేడియం & మల్టిపర్పస్ హాల్, రూ.2 కోట్లతో ధర్మసాగర్ చెరువు వద్ద మురుగు నీటి శుద్ధీకరణ (1.0 MLD – STP) ప్లాంట్, రూ.3కోట్లతో ధర్మసాగర్ -మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి & రూ.1.50 కోట్లతో బండ్ వైడెనింగ్ (కట్ట విస్తరణ). రూ.2 కోట్లతో ఇబ్రహీం చెరువు బండ్ వైడనింగ్ (కట్ట విస్తరణ), రూ.2.50 కోట్లతో పాత ఎమ్మార్వో కార్యాలయం వెనుక పార్కు అభివృద్ధి, ఇతర చెరువుల అభివృద్ధి, బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం, ప్రధాన కూడళ్ళ అభివృద్ధి, సైక్లింగ్ ట్రాక్, సామాజిక భవనాలు, స్మశాన వాటికలు, ఇతర అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తామన్నారు. టెండర్లు పూర్తి కాగానే పనులను వేగంగా చేయించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు. నిధుల మంజూరుకు ప్రత్యేక చొరవ చూపిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కౌన్సిలర్లు, అధికారులు సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు.