Monday, November 18, 2024

అన్నార్థుల ఆకలి తీరుస్తున్న రూ.5 భోజనం.. సిటీలో సిట్టింగ్‌ అన్నపూర్ణ క్యాంటీన్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కడు పేదలు, పొట్ట చేతపట్టుకుని పట్నానికి వచ్చే వారి ఆకలిని తీర్చుతోంది రూ.5 అన్నపూర్ణ భోజన పథకం. దీన్ని తెలంగాణ ప్రభుత్వం 2014 నుంచి విజయవంతంగా అమలు చేస్తోంది. కేవలం రూ.5లకే 400 గ్రాముల అన్నాన్ని, 120 గ్రాముల సాంబారు, 100 గ్రాముల పప్పుతో పాటు 15 గ్రాముల పచ్చడితో కూడిన పోషక విలువలున్న భోజనాన్ని అన్న పూర్ణ పథకం కింద ప్రభుత్వం అందజేస్తున్నది. 2014లో జీహెచ్‌ఎంసీ చొరవ తీసుకుని ప్రవేశపెట్టిన అన్న పూర్ణ భోజనం పథకాన్ని ప్రభుత్వం నిర్విరామంగా పర్యవేక్షిస్తూ పటిష్టంగా అమలు చేస్తోంది.

ఇందులో భాగంగానే అన్నపూర్ణ కేంద్రాల వద్ద భోజనం చేసేవారు కూర్చొని సౌకర్యవంతంగా భోజనం చేసేలా వసతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కడపడితే అక్కడా రోడ్ల పక్కన, చెట్ల కింద కూర్చొని తినకుండా సీటింగ్‌ అన్నపూర్ణ క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు నగరంలో 32 ప్రాంతాలను గుర్తించి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

రూ.5 అన్నపూర్ణ భోజనం.. పేదలు, విద్యార్థులు, ఉద్యోగార్థుల ఆకలి తీరుస్తున్నది. 2014 నుంచి ఈఏడాది మే నెలాఖరు వరకు 9 కోట్ల 67 లక్షల 53వేల 612 మంది అన్నపూర్ణ భోజనం చేశారు. దానికిగానూ రూ.185 కోట్ల 89 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేసింది. కోవిడ్‌ విపత్తుకు ముందు 150 కేంద్రాల ద్వారా రోజుకు 45 వేల అన్న పూర్ణ భోజనాలను అందించేవారు. కానీ మొదటి విడత కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో హైదరాబాద్‌ నగరంలో మధ్యాహ్నం పూట 373 రెగ్యులర్‌, మొబైల్‌ కేంద్రాలు పూర్తిగా ఉచితంగా అన్నపూర్ణ భోజనం పెట్టడం జరిగింది. అదేవిధంగా 259 రెగ్యులర్‌, మొబైల్‌ కేంద్రాల ద్వారా రాత్రిపూట సైతం భోజనం పెట్టడం జరిగింది. ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్‌ లాంటి విపత్తులో నిరుపేదల ఆకలి బాధను తీర్చేందుకు అన్న పూర్ణ పథకం అక్షయపాత్రగా మారిందని చెప్పాలి.

2020-21లో మొత్తం 2 కోట్ల 29 లక్షల 46వేల 80 భోజనాలను అన్నార్థుల ఆకలిని తీర్చడం జరిగింది. కేవలం వారి ఆకలిని తీర్చడమే కాకుండా లబ్ధిదారులు సౌకర్యవంతంగా భోజనం చేసేలా సీటింగ్‌ సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. దీనికోసం నగరంలో మొదటగా 32 సీటింగ్‌ అన్నపూర్ణ క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement