పెద్దపలి (ప్రభ న్యూస్): భూ కబ్జాదారునిపై పెద్దపల్లి పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి తెలిపారు. భూ కబ్జాలకు పాల్పడుతూ ప్రజలను మోసగిస్తున్న గోదావరిఖనికి చెందిన ఉప్పు గట్టేష్ పై శనివారం రౌడీషీట్ ఓపెన్ చేశామన్నారు. తమను మోసగించాడని పలువురి ఫిర్యాదు మేరకు గట్టేష్ పై కేసు నమోదు చేశామన్నారు. తీరు మార్చుకోవాలని సీపీ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలో భూ ఆక్రమణలకు పాల్పడినా, ఇతరుల భూములు కబ్జా చేసినా, ప్రజలను మోసగించినా రౌడీషీట్లు ఓపెన్ చేయడంతోపాటు పిడి యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మును తో భూములు, ఫ్లాట్స్ కొనుగోలు చేసే వారిని మోసం చేస్తూ రిజిస్ట్రేషన్ చేయించకపోవడం, డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం, దాడులకు పాల్పడడం, చీటింగ్ లకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
అమాయక ప్రజలను మోసం చేస్తే చూస్తూ ఉరికునేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేసి కోర్టు ముందు నిజానిజాలు సాక్ష్యాధారాలతో సహా సమర్పించి కోర్ట్ ద్వారా శిక్ష పడే విధంగా చూడడం జరుగుతుందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దుర్బుద్ధితో అమాయకమైన ప్రజలను మోసగిస్తే కేసులు నమోదు చేయడంతోపాటు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు. కౌన్సెలింగ్ లో పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐలు రాజేష్ , ఉపేందర్, రాజ వర్ధన్ తో పాటు పలువురు పాల్గొన్నారు.