Tuesday, November 26, 2024

TS: మేడారం వెళ్తున్నారా… ఇదిగో రూట్ మ్యాప్‌….

తెలంగాణ కుంభ‌మేళా మేడారం… ఈ వ‌న జాత‌ర‌కు ల‌క్ష‌లాది భ‌క్తులు వ‌స్తుంటారు… స‌మ్మ‌క్క‌సారాల‌మ్మ‌ను ద‌ర్శించుకొని స‌ల్లంగా చూడాల‌ని మొక్కులు చెల్లించుకుంటారు. బుధ‌వారం నుంచి నాలుగు రోజుల పాటు అంగ‌రంగ వైభ‌వంగా సాగే జాత‌ర‌కు రూట్‌మ్యాప్ ఏర్పాటు చేశారు.

- Advertisement -

కాగా, జాత‌ర‌కు పోలీసు శాఖ కూడా అన్ని విధాలుగా సిద్ధమయ్యారు. వనదేవతలైన సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు వేలాది వాహనాలు తరలి వస్తుండగా.. మేడారం రహదారిపై ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు నేటి నుంచి జాతర ముగిసే వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించగా, పలుచోట్ల వన్ వే ట్రాఫిక్ కూడా విధించారు. మేడారం రూట్‌ మ్యాప్‌ను ములుగు ఎస్పీ శబరీష్‌ విడుదల చేశారు. మేడారం మహాజాతరకు వెళ్లే వాహనాలు ఏయే రూట్లలో ప్రయాణించాలి? ఎక్కడి నుంచి క్రాసింగ్ వెళ్లాలో వివరిస్తూ మేడారం రూట్ మ్యాప్ ప్రకటించారు.

మేడారం రూట్ మ్యాప్…

  • హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్, వరంగల్, హనుమకొండ మీదుగా వచ్చే వాహనాలు ములుగు, పస్రా మీదుగా గూడెప్పాడ్, ఆత్మకూరు మీదుగా వెళ్లాలి. అక్కడి నుంచి నార్లాపూర్ మీదుగా మేడారం చేరుకోవాలి.
  • ఖమ్మం, మహబూబాబాద్ నుంచి వచ్చే వాహనాలు నర్సంపేట మీదుగా ములుగు మండలం మల్లంపల్లికి చేరుకోవాలి. అక్కడి నుంచి ములుగు, పస్రా, నార్లాపూర్ మీదుగా 163 జాతీయ రహదారి మీదుగా మేడారం చేరుకోవాలి. ఈ మార్గంలో వచ్చే వాహనాలకు ఊరట్టం క్రాస్‌ నుంచి ప్రాజెక్ట్‌ నగర్‌ వరకు అన్ని చోట్ల పార్కింగ్‌ స్థలాలు కూడా అందుబాటులో ఉంచారు.
  • జాతర ముగించుకుని తిరుగు ప్రయాణంలో భూపాలపల్లి, రేగొండ, పరకాల మీదుగా నార్లాపూర్, బయ్యక్కపేట, గొల్లబుద్దారం, కమలాపురం క్రాస్ మీదుగా గూడెప్పాడ్ క్రాస్ దగ్గర కుడివైపునకు వెళ్లి, అక్కడి నుంచి హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్, వరంగల్, హనుమకొండ మీదుగా గమ్యస్థానాలకు వెళ్లవచ్చు.
  • ఖమ్మం, మహబూబాబాద్ వైపు వెళ్లే వాహనాలు గూడెప్పాడ్ వద్ద ఎడమవైపు నుంచి ములుగు వైపు వెళ్లాలి. ఆత్మకూరు, కటాక్షపూర్ దాటిన తర్వాత మల్లంపల్లి వచ్చి అక్కడ మలుపు తీసుకుని సొంత గ్రామాలకు వెళ్లవచ్చు.
  • గోదావరిఖని, మంచిర్యాల, పెద్దపెల్లి, మహారాష్ట్ర, కాళేశ్వరం నుంచి వచ్చే వాహనాలు కాటారం నుంచి చింతకాని, యామన్ పల్లి, పెగడపల్లి, సింగారం, కాల్వపల్లి మీదుగా ఊరట్టం చేరుకోవాలి. అలాంటి వాహనాలకు ఊరట్టం సమీపంలో పార్కింగ్ స్థలాలు కేటాయించారు. ఈ వాహనాలన్నీ కూడా తిరుగు ప్రయాణంలో అదే మార్గంలో బయలుదేరాలి. అంతే కాకుండా నార్లాపూర్, బయ్యక్కపేట, గొల్లబుద్దారం, కమలాపురం క్రాస్ మీదుగా వెళ్లే అవకాశం కూడా ఉంది.
  • ఛత్తీస్‌గఢ్. భద్రాచలం, మణుగూరు నుంచి వచ్చే వాహనాలు ఏటూరునాగారం, చిన్న బోయినపల్లి, కొండాయి, ఉరట్టం మీదుగా మేడారం చేరుకోవాలి. ఈ వాహనాలన్నీ తిరుగు ప్రయాణంలో వచ్చిన దారిలోనే బయలుదేరాలి.

పార్కింగ్ ప్రదేశాల్లో అన్ని సౌకర్యాలు

మహాజాతర కోసం ‘మేడారం జాతర’ పేరుతో మొబైల్ యాప్‌ను విడుదల చేసిన అధికారులు వాహనాలకు ఇబ్బందులు తలెత్తకుండా మేడారంలో 33 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. మేడారం చుట్టుపక్కల 1,400 ఎకరాలను పార్కింగ్ కోసం రిజర్వు చేశారు. ఆర్టీసీ బస్సులను తాడ్వాయి మేడారం రూట్ బస్టాండ్ స్థలంలో పార్కింగ్ చేయాలి. సీట్ల దగ్గరే వీఐపీ, వీవీఐపీ పార్కింగ్ స్థలాలు కేటాయించారు. పస్రా, మేడారం మార్గంలో జంపన్నవాగు సమీపంలో ప్రైవేట్ వాహనాలు నిలిపేందుకు అవకాశం కల్పించారు. భక్తులు వీలైనంత వరకు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement