Thursday, November 21, 2024

తెలుగు రాష్ట్రాలపై రోశయ్య చెరగని ముద్ర : ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్త‌

రెండు తెలుగు రాష్ట్రాలపై దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య చెరగని ముద్ర వేసుకున్నారని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త పేర్కొన్నారు. అటువంటి మహానేత ఆధ్వర్యంలో పేదల కోసం వైశ్య జాతి హక్కుల కోసం రాజీలేని పోరాటాలు నడిచేవని ఆయన గుర్తుచేశారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సంతాప సభని పురస్కరించుకుని ఈరోజు హైదరాబాద్ లోని ముషీరాబాద్ వైశ్య హాస్టల్ లో జరిగిన మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సంస్మరణ సభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉప్పల శ్రీనివాస్ గుప్త పాల్గొన్నారు. రోశయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, జ్యోతులు వెలిగించి, నివాళులర్పించారు. ఆయ‌న‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంతాప సూచకంగా సంస్మరణ సభలో రెండు నిమిషాలు పాటు మౌనం పాటించారు.


ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ.. ఈరోజు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆయ‌న‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగిందన్నారు. ఆర్ధిక శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా పలు పదవులకు వన్నె తెచ్చిన రోశయ్య.. సౌమ్యుడిగా, సహన శీలిగా, రాజకీయాల్లో తనదైన ప్రత్యేక శైలిని హూందాతనాన్ని నిరూపించుకున్నారని, ఆర్యవైశ్య జాతి ముద్దుబిడ్డ, వైశ్య రత్నం అని కొనియాడారు. వారి సేవలను వారి స్మృతులను గుర్తు చేసుకున్నారు. 2009-10 బడ్జెట్ తో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరుపొందారని అన్నారు. నిత్యం బీద ప్రజల అభ్యున్నతికి పరితపించిన మహానేత అని కొనియాడారు.ముఖ్యమంత్రి కేసీఆర్ కు రోశయ్య అంటే చాలా అభిమానమ‌న్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో రోశయ్య స్మృతి వనం, ఒక కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుదామన్నారు. ఆయ‌న‌ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. ఆయ‌న‌ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నామని తెలిపారు.


ఈ కార్యక్రమంలో.. ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, ఐవీఎఫ్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గంజి రాజమౌళి, ఓ న్యూస్ ఛానల్ సీఎండీ కాచం సత్యనారాయణ, వామ్స్ ప్రెసిడెంట్ నాగ భూషణం, వీబీజీ చైర్మన్ ఎం.రాము, మాజీ వాసవి సేవా సమితి అధ్యక్షుడు రాజశేఖర్ గుప్త, వాసవి సేవా కేంద్రం అధ్యక్షుడు అలంపల్లి శ్రీనివాస్, ఐవీఎఫ్‌ స్టేట్ సెక్రటరీ పబ్బ చంద్రశేఖర్, ఐవీఎఫ్‌ రాష్ట్ర మహిళా విభాగం గంగిశెట్టి సుజాత, ఐవీఎఫ్ పొలిటికల్ కమిటీ చైర్మన్ బచ్చు శ్రీనివాస్, ఐవీఎఫ్‌ నాయకులు గౌరిశెట్టి ప్రభాకర్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్-తెలంగాణ రాష్ట్ర అన్ని జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, ఐవీఎఫ్‌ కమిటీ సభ్యులు, రెండు జంట నగరాల అధ్యక్షులు, అన్ని విభాగాల సభ్యులు, ఐవీఎఫ్ సీనియర్ ప్రెసిడెంట్ నల్లగొండ జిల్లా ఎల్వీ కుమార్, ఐవీఎఫ్‌ సీనియర్ ప్రెసిడెంట్ పీఎస్ఆర్ మూర్తి, ముత్యాల సత్తయ్య, వీబీజీ రాజు, ఆలేటి రవి, ఐవీఎఫ్ నాయకులు, వివిధ ఆర్యవైశ్య సంఘాల నాయకులు, పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement