హైదరాబాద్ – తెలంగాణ అసెంబ్లీకి ముందు ఇవాళ కొత్త ఆర్‌ఓఆర్ బిల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు.
ధరణి పోర్టల్‌ను భూమాతగా మార్చాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం అమలులో ఉన్న ROR 2020 చట్టం రద్దు కానుంది.
ఆర్‌ఓఆర్ చట్టం -2024 ముసాయిదాలోని ముఖ్యాంశాలు
1. డిజిటల్ ల్యాండ్ రికార్డులను సరిదిద్దడానికి ఇందులో నిబంధన ఉంది. ఇప్పటికే ఉన్న సర్యులర్ 1 లేదా దాని సవరించిన వర్షన్‌కు చట్టబద్ధమైన మద్దతు ఉంటుంది
.2. పార్ట్-బి కేసులపై నిర్ణయం తీసుకునేందుకు వీలుంది.
3. భవిష్యత్తులో రీ-సర్వే తర్వాత కొత్త ఆర్వోఆర్ని సిద్ధం చేయడానికి నిబంధన ఉంది. ఇదే సమయంలో 1971 ఆర్వోఆర్ చట్టం ప్రకారం తయారు చేసిన, 2020 చట్టం ప్రకారం నిర్వహిస్తున్న ఆర్వోఆర్ సైతం ఈ చట్టం కింద వర్తిస్తుంది
.4. విక్రయం, బహుమతి, తనఖా, మార్పిడి, వారసత్వం, సివిల్ లేదా రెవెన్యూ కోర్టు డిక్రీ/ఆర్డర్, లోక్ అదాలత్ అవార్డు, అసైన్మెంట్ పట్టా, ఓఆర్సీ, 38ఈ, 13బీ, సేల్ సర్టిఫికేట్తో పాటు ఇతర చట్టద్ధమైన పద్ధతుల ద్వారా హక్కులను పొందిన యజమానుల హక్కులు నమోదు చేస్తారు. ఆర్వోఆర్ 2020లో వీటికి అవకాశం లేదు.
5. అమ్మకం, బహుమతి, తనఖా, మార్పిడి సమయంలో తహశీల్దార్ ఆటో మ్యుటేషన్ చేస్తారు. వీటిలో మోసం జరిగినప్పుడు మ్యుటేషన్ను నిలిపివేసే అధికారాలు తహశీల్దార్కు ఉంటాయి. వారసత్వం (సక్సేషన్) విషయంలో విచారణ జరిపి నిర్దేశించిన సమయంలో తహశీల్దార్ మ్యుటేషన్ చేస్తారు. సివిల్ లేదా రెవెన్యూ కోర్టు డిక్రీ/ఆర్డర్, లోక్ అదాలత్ అవార్డు, అసైన్మెంట్ పట్టా, ఓఆర్సీ, 38ఈ, 13బీ, సేల్ సర్టిఫికేట్ మరియు ఇతర మోడ్‌ల ద్వారా భూమి హక్కులను పొందే విషయంలో ఆర్డీఓ/సబ్ కలెక్టర్ విచారించి మ్యుటేషన్ చేస్తారు. అబాదీ, వ్యవసాయేతర భూములను స్థానిక సంస్థలు మ్యుటేషన్ చేస్తాయి.
6. రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు మినహా ఇతర కేసుల్లో మ్యుటేషన్ చేసే ముందు తప్పనిసరిగా విచారణ జరుగుతుంది.
7. ప్రభుత్వం నిర్ధేశించిన తేది నుంచి రిజిస్ట్రేషన్‌కు ముందే సర్వే, సబ్ డివిజన్ నిర్వహించాలి. రిజిస్ట్రేషన్ తర్వాత నిర్ణీత గడువులోగా మ్యుటేషన్ పూర్తి చేయాలి.
8. అబాది భూములకు ఆర్వోఆర్ నమోదు (భవిష్యత్తులో).
9. పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ అదనంగా భూధార్ కార్డ్ జారీ (భవిష్యత్తులో).
10. ఇప్పటికే ఉన్న రికార్డులను ధ్రువీకరించిన తర్వాత తాత్కాలిక భూధార్ జారీ చేస్తారు. దీంతో ధరణిలో లోపాలను గుర్తించేందుకు ప్రభుత్వానికి వీలు కలుగుతుంది (భవిష్యత్తులో).
11. కమతాల జియో రిఫరెన్స్ తర్వాత శాశ్వత భూధార్ జారీ చేస్తారు (భవిష్యత్తులో).
12. అప్పీల్ మరియు రివిజన్ యంత్రాంగం – కలెక్టర్ అదనపు కలెక్టర్‌కు మొదటి అప్పీల్, సీసీఎల్టికి రెండో అప్పీల్ చేసుకోవచ్చు. ప్రభుత్వం రివిజన్ చేసే అవకాశం ఉంటుంది. ఆర్వోఆర్ చట్టం, 2020లో సమస్యల పరిష్కార యంత్రాంగం అందుబాటులో లేదు.
13. 02-06-2014 లోపు తీసుకొని పెండింగ్ లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులకు క్రమబద్ధీకరణకు అవకాశం ఉంది.
14. భూరికార్డుల సవరణ కోసం సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. యాజమాన్య వివాదాలు, పంపకాల కేసుల విషయంలో మాత్రమే సివిల్ కోర్టులను ఆశ్రయించాలి.
15. ఆర్ఆర్ ఆధారంగా పహాణిలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆర్వోఆర్ చట్టం – 2020లో గ్రామ రికార్డులను ఆర్వోఆర్‌కు లింక్ చేసే అవకాశం లేదు.