Saturday, November 23, 2024

చెరువులను తలపిస్తున్న వరంగల్‌ రహదారులు.. భారీ వర్షాలతో రోడ్లన్నీ జలమయం

నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్‌ చౌరస్తా రహదారితో పాటు స్టేషన్‌ రోడ్డులో వరద నీరు చేరడంతో స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పెరికవాడ, మైసయ్యనగర్‌లలో వరదనీరు రోడ్డుపై నిలవడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. రాయపర్తి మండలం గన్నారంలో పలుచోట్ల ఇండ్లు కూలీపోయి ప్రజల నిల్వ నీడ లేకుండాపోయింది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండెపల్లి, ఇంద్రానగర్‌లలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి ఇండ్లు కూలిపోయాయి. భూపాలపల్లి, ములుగు జిల్లాలపై వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. విడవకుండా కురుస్తున్న వర్షానికి పలుచోట్ల రోడ్లు తెగిపోయి రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఘనపురం మండలం మోరంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వైకుంఠధామం నీట మునిగింది. చెల్పూర్‌ నుంచి పెద్దాపూర్‌కు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. ఘనపురం – కొండాపురం మధ్యం వాగు రావడంతో సీతారాంపురం, అప్పయ్యపల్లె, గుర్రంపేట వాసులు మండల కేంద్రానికి వెళ్లాలంటేనే వీలు లేకుండా పోయింది. భూపాలపల్లిలోని బాంబులగడ్డ ప్రాంతంలోని ఇండ్లలోకి భారీగా నీరు చేరింది. ప్రభుత్వ పాఠశాలలోకి వరదనీరు చేరి జలమయమైంది. వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోకి వరదనీరు చేరడంతో రోగులు, వైద్యులు ఇబ్బందులు పడ్డారు.

పలిమెల మండలానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కనీసం తాగడానికి మంచినీరు దొరకని పరిస్థితి ఏర్పడింది. మహాముక్తారం మండలంలో వాగుల ఉధృతికి రహదారులు కొట్టుకుపోయాయి. గ్రామాల చుట్టూ వరదనీరు చేరడంతో అటవీ ప్రాంతాల్లో ప్రజలు షామియానాలు వేసుకుని తలదాచుకుంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి, పంటనష్టం జరగకుండా చూడాలని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అధికారులను ఆదేశించారు. శిథిలావస్థకు చేరుకున్న ఇండ్లలోని వారిని పునరావాస కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ప్రసవాలకు ఉన్న గర్భిణీలను, డయాలసిస్‌ రోగులను జిల్లా కేంద్రంలోని ఆసుపత్రులకు తరలించాలని ఆమె మహబూబాబద్‌ జిల్లాలో సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులను కోరారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండెపల్లి, ఇంద్రానగర్‌ గ్రామాల్లో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇండ్లు నేల మట్టమయ్యాయి. శిథిలావస్తలో ఉన్న ఇండ్లలో ఉన్న వారిని స్థానిక పాఠశాల భవనాల్లో తాత్కాలిక వసతి కేంద్రాలు ఏర్పాటు చేసి అందులోకి వారిని తరలిస్తున్నారు. వర్ధన్నపేట మీదుగా ఉన్న ఆకేరు వాగు పరవళ్లు తొక్కుతోంది. దీంతో గంగాదేవి చెక్‌డ్యామ్‌ మీద నుంచి ప్రవాహం కొనసాగుతోంది. రాయపర్తి, సంగెం, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లో ఎడతెరిపిలేని ముసురు వాన కురుస్తోంది. రాయపర్తి మండల కేంద్రం గన్నారం గ్రామంలో భారీ వర్షాలకు ఇండ్లు కూలిపోయాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement