Thursday, November 21, 2024

ఆర్‌ఎంపీలదే హవా… అందరూ శంకర్​దాదా ఎంబీబీఎస్​లే!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రోగులకు సకాలంలో ప్రథమ చికిత్స చేసి, పెద్దాసుపత్రులకు పంపాల్సిన ఆర్‌ఎంపీ వైద్యులు హద్దు దాటుతున్నారు. అనారోగ్యానికి గురైన వారికి సకాలంలో ప్రాథమిక వైద్యం అందించి ప్రాణాలు కాపాడాల్సి ఉండగా కాసుల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రయివేటు ఆసుపత్రులు, వైద్య, ఆరోగ్యశాఖలోని అధికారుల అండదండలతో ఏకంగా శస్త్ర చికిత్సలను కూడా చేసేస్తున్నారు. వచ్చిరాని జ్ఞానంతో ఆర్‌ఎంపీలు చేస్తున్న పెద్దస్థాయి వైద్యం అనేకసార్లు వికటిస్తోంది. పలితంగా ఎంతో మంది రోగులు ప్రాణాలు పోతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. వ్యాధి, జ్వరం ఆరంభ దశలో వచ్చిరాని వైద్యంతో కాలయాపన చేస్తున్న ఆర్‌ఎంపీలు… రోగి పరిస్థితి విషమించగానే తమ చేతులకు మట్టి అంటకుండా పెద్దాసుపత్రులకు పంపుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రిజిస్టర్‌ ్డ మెడికల్‌ ప్రాక్టిషనర్స్‌ (ఆర్‌ఎంపీ)లు 50వేలకు పైగానే ఉంటారని వైద్య, ఆరోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం విషజ్వరాలు విజృంభిస్తున్న వేళ ప్రమాదకరమైన డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి పరీక్షలు చేయడమే కాకుండా వైద్యం కూడా అందిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆర్‌ఎంపీలు ఎంబీబీఎస్‌ స్థాయి వైద్యులు చేయాల్సిన వైద్యం అందిస్తున్నా ఆయా జిల్లాల వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెలనెలా మామూళ్లు తీసుకుంటున్న వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఆర్‌ఎంపీలు నడిపే పెద్దాసుపత్రులపై కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆర్‌ఎంపీలనే నమ్ముకుని నడుస్తున్న ప్రయివేటు ఆసుపత్రులు, ల్యాబ్‌లు…

ఆర్‌ఎంపీలను నమ్ముకుని జిల్లాలు, ముఖ్యపట్టణాలతోపాటు హైదరాబాద్‌లోనూ పలు ప్రయివేటు/కార్పోరేటు ఆసుపత్రులు నడుస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రయివేటు ఆసుపత్రుల వైద్యులు కమిషన్లు ఇచ్చి మరి ఆర్‌ఎంపీలు తమ ఆసుపత్రులకే పేషెంట్లను రెఫర్‌ చేసేలా వ్యవహరం నడిపిస్తున్నారు. డాక్టర్లు రాసిన ప్రిస్కిప్షన్ల ఆధారంగా ల్యాబ్‌ టెస్టులు చేయాల్సిన ల్యాబ్‌ నిర్వహకులు ఆర్‌ఎంపీలు రెఫర్‌ చేసినా టెస్టులు చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలు డయాగ్నస్టిక్‌ సెంటర్లు, ల్యాబ్‌లు ఆర్‌ఎంపీలు పంపే రోగులపై ఆధారపడే కొనసాగుతున్నాయన్న విమర్శలు లేకపోలేదు. ఆర్‌ఎంపీల బాగోతాలు తెలిసినా వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు మామూళ్లు తీసుకుని చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

రాష్ట్రంలోని పలు జిల్లాలోని చాలా వరకు ప్రయివేటు ఆసుపత్రులు ఆర్‌ఎంపీలు రెఫర్‌ చేస్తున్న పేషెంట్లతోనే నడుస్తున్నాయంటే వైద్యవ్యాపారం ఆర్‌ఎంపీల చేతిలో ఏస్థాయిలో కేంద్రీకృతమై ఉందో అర్థం చేసుకోవచ్చు. సర్కారు జిల్లా, ఏరియా, ఆసుపత్రులతోపాటు పీహెచ్‌సీల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నా ఆర్‌ఎంపీలు ప్రభుత్వ వైద్యంపై వ్యతిరేక ప్రచారం చేస్తుండడంతో రోగులు ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయి.

నేరాల్లోనూ ఆర్‌ఎంపీలదే కీలకపాత్ర…

డబ్బుపై అత్యాశ, స్వలాభాల కోసం అనైతిక కార్యక్రమాల్లో, నేర ఘటనల్లోనూ ఆర్‌ఎంపీలు పాలుపంచుకుంటున్న ఘటనలు ఇటీవల చోటు చేసుకుంటున్నాయి. ఆర్‌ఎంపీ వైద్యుడిగా తమకున్న గుర్తింపును ఆసరాగా చేసుకుని రాజకీయాల నుంచి రియల్‌ఎస్టేట్‌, ఇతర వ్యాపారాలను ఆర్‌ఎంపీలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న నేరాలు… ఇంజక్షన్‌ హత్య, టీఆర్‌ఎస్‌ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య, రెండోభార్యకు మత్తు మందు ఇచ్చి హత్య ఘటనల్లో ఆర్‌ఎంపీలే ప్రధాన నిందితులుగా ఉండడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement