జన్నారం, జులై 20 (ప్రభ న్యూస్): నిర్మల్ జిల్లా కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షాలకు కురుస్తున్నందున ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తి ఏ సమయంలోనైనా దిగువ ప్రాంతానికి నీరు వదిలే అవకాశముందని ఆ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాథోడ్ విటల్ శనివారం సాయంత్రం తెలిపారు.
సాయంత్రం 5 గంటల వరకు ప్రాజెక్టు నీటి నిలువ సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 690.175 అడుగులు నీరు చేరిందన్నారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు పడుతున్నందున ప్రస్తుతం ఉన్న ఇన్ ఫ్లో 5,716 క్యూసెక్కులు ఉందని, ఇంకా ఇన్ ఫ్లో ఎక్కువ పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. దీంతో వరద గేట్లు ఏ సమయంలోనైనా ఎత్తే అవకాశాలు ఉన్నందున దిగువ మంచిర్యాల జిల్లా గోదావరి పరివాహక ప్రాంతంలోని జాలర్లు, పశువుల కాపర్లు, గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.