హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సీహెచ్ ఎంవీ కృష్ణారావు కన్నుమూశారు.. ఆయన వయస్సు 64 సంవత్సరాలు. క్యాన్సర్ తో ఆయన గత కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్నారు..ఈ నేపధ్యంలోనే ఆయన నేటి ఉదయం తుది శ్వాస విడిచారు.. 47 ఏళ్లుగా జర్నలిస్ట్ గా కొనసాగుతున్న ఆయనను మీడియా రంగంలో బాబాయ్ అంటూ పిలిచేవారు.. 1975లో కృష్ణారావు స్టింగర్గా తన జర్నలిజం ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్ర భూమి, డెక్కన్ క్రానికల్, న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ వంటి పలు పత్రికల్లో పనిచేశారు. డెక్కన్ క్రానికల్ పత్రికలో న్యూస్ బ్యూరో చీఫ్గా 18 ఏండ్లపాటు సేవలందించారు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు..
కాగా, కృష్ణారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా చేసిన సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. పలు రంగాల్లో లోతైన అవగాహనతో ప్రజాప్రయోజనాల కోణంలో కృష్ణారావు చేసిన రచనలు, విశ్లేషణలు, కొనసాగించిన టీవీ చర్చలు ఆలోచన రేకెత్తించేవిగా వుండేవని తెలిపారు. నాలుగు దశాబ్దాలకు పైబడి జర్నలిజం రంగానికి నిజాయితీగా సేవలందించిన సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆయన సేవలు మరువలేం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
పాత్రికేయ విలువలకు పట్టంగడుతూ రాతలు, విశ్లేషణల్లో ప్రజాసంక్షేమానికే ప్రాధాన్యతనిచ్చిన సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ విశ్లేషకుడు సీహెచ్ఎంవీ కృష్ణారావు అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అనారోగ్యంతో మరణించడం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గత నాలుగు దశాబ్దాలుగా పాత్రికేయ రంగానికి ఆయన చేసిన సేవలు మారువలేనివని, ఆయన మరణం తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
పాత్రికేయ లోకానికి తీరని లోటు: భట్టి విక్రమార్క
సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు కృష్ణారావు (64) హైదరాబాద్లో అకాల మరణం పాత్రికేయ లోకానికి తీరని లోటని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. జర్నలిజంలో సరికొత్త విలువలను ఆద్యుడిగా ఆయన నిలిచారనడంలో ఎటువంటి సందేహం లేదని పేర్కొన్నాయి. బాబాయిగా అందరికీ సుపరిచితులైన కృష్ణారావు గత నాలుగు దశాబ్దాలుగా పలు మీడియా సంస్థల్లో పనిచేస్తూ ప్రజలకు సేవ చేశారని పేర్కొన్నారు. సమకాలీన రాజకీయ విశ్లేషణల్లో తనదైన ముద్ర వేసిన కృష్ణారావు గారు నిక్కచ్చిగా తన అభిప్రాయాలను చెబుతారనే పేరుగాంచారని గుర్తుచేశారు. ఏ మీడియా సంస్థలో పనిచేసినా తనదైన ముద్ర వేసిన కృష్ణారావు గారి మరణం పత్రికా రంగానికి తీరని లోటుగా భావిస్తున్నాని విచారం వ్యక్తం చేశారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డిల సంతాపం
సిహెచ్ఎంవీ కృష్ణారావు మరణం పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తనను కలిచి వేసిందని పేర్కొన్నారు. సుధీర్ఘ కాలంగా కృష్ణారావుతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేసుకున్నారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం తెలియజేశారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణ రావు గారు పాత్రికేయ వృత్తిలో ఉండి సమాజానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.