Friday, September 6, 2024

RIP – పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య కన్నుమూత

ఖమ్మం: పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య (65) అనారోగ్యంతో ఆదివారం మణుగూరులోని తన నివాసంలో మృతి చెందారు. సకిని రామచంద్రయ్య గత కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు.

ఆదివాసీ దేవతలైన సమ్మక్క సారలమ్మ జీవిత చరిత్రను కంచు మేళం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన సకిని రామచంద్రయ్యకు కేంద్ర ప్రభుత్వం 2022లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. పద్మ శ్రీ రామచంద్రయ్యకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. కోటి నగదుతో పాటుగా ఇంటి స్థలాన్ని ప్రకటించింది.అయితే రామచంద్రయ్యకు ప్రకటించిన నగదు పారితోషికం ఇప్పటికీ అందలేదు. పైగా ఇంటి స్థలం పత్రాలు కూడా ఇవ్వలేదు. వయస్సు రీత్యా రామచంద్రయ్య ఆరోగ్యం క్షీణించడంతో, వైద్య ఖర్చుల నిమిత్తం ఆదుకోవాలని ఇటీవల మంత్రి సీతక్కను కలిసి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం ప్రకటించిన పారితోషికాన్ని అందించాలని కోరారు..

- Advertisement -

కాగా, సకిని రామచంద్రయ్య మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మని తన మేళంతో ప్రచారాన్ని కొనసాగించేవారు. కోయ తెగల చరిత్రను, విశిష్టతను గానం చేస్తూ కోయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతున్న రామచంద్రయ్యకు కేంద్ర ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది.

దీంతో మారుమూల అటవీ ప్రాంతాల్లో ప్రదర్శించే అరుదైన కళాకారుడికి దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కింది. డోలి కులస్తులు భద్రాచలం, ఏటూరు నాగారం, ఛత్తీస్ గఢ్ ప్రాంతాల్లో ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో కోయ తెగల వంశ చరిత్రను చెప్పే ఏకైక కళాకారుడు రామచంద్రయ్యే కావడం గమనార్హం.

జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంతాపం..

పద్మశ్రీ సకిని రామచంద్రయ్య మృతికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్…ప్రగాడ సంతాపం తెలిపారు. మరణ వార్త తెలిసిన వెంటనే రామచంద్రయ్య ఇంటికి వెళ్ళారు కలెక్టర్. . సకిని బౌతిక కాయం పై పూల మాల వేసి నివాళి అర్పించారు వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు

Advertisement

తాజా వార్తలు

Advertisement