Friday, November 22, 2024

RIP – సంప‌త్ కుటుంబాన్ని ఓదార్చిన కెటిఆర్ .. అన్ని విధాల అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా

జ‌న‌గామ – బీఆర్‌ఎస్‌ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డిని పార్థివదేహానికి ఇవాళ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నివాళులు అర్పించారు.. సంపత్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం సంపత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. బీఆర్‌ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన పాగాల సంపత్‌రెడ్డి హఠాన్మరణం బాధాకరం అన్నారు. 14 ఏళ్లు కేసీఆర్ గారి వెంట సైనికుడిలా ఉండి పని చేశారని, సంపత్‌రెడ్డి మరణం ప్రతి బీఆర్‌ఎస్ కార్యకర్తను కలచి వేసిందన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సంపత్‌రెడ్డి క్రియాశీలకంగా పని చేశారని, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా నిబద్ధతతో పనిచేస్తూ విజయవంతం చేశారన్నారు. సంపత్‌రెడ్డి కుటుంబానికి కేసీఆర్, పార్టీ శ్రేణుల తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంపత్‌రెడ్డి మరణం పార్టీకి తీరని లోటన్న కేటీఆర్, వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు..
రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల జెడ్పీఛైర్మన్లు, జిల్లా అధ్యక్షులు పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నివాళులు అర్పించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు ఇచ్చారు.

కాగా, సంపత్ రెడ్డి (55) సోమవారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. హనుమకొండలోని తన నివాసంలో చాయ్ తాగిన కొద్దిసేపటికే గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. జనగామ జిల్లా చిల్పూరు మండలం రాజవరం గ్రామానికి చెందిన సంపత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడిగా బీఆర్‌ఎస్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సంపత్ మరణ వార్త తెలియగానే ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, రాజయ్య తదితరులు సంపత్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement