Tuesday, November 19, 2024

RIP – ఎమ్మెల్యే మహేష్ రెడ్డికి పితృవియోగం ..మంత్రులు సబితా, మహేందర్ రెడ్డిల సంతాపం

వికారాబాద్ జిల్లా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి తండ్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్ రెడ్డి కన్నుమూశారు.. మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు కొప్పుల హరీశ్వర్ రెడ్డి రాత్రి సుమారు 11 గంటలకు గుండెపోటుతో మృతి చెందారు. ఆయ‌న వ‌య‌స్సు 77 సంవ‌త్స‌రాలు. హరీశ్వర్ రెడ్డి మృతితో నియోజకవర్గంలో పలువురు నేతలు నాయకులు కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకున్నారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి తో పాటు ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, కాలే యాదయ్యలు మహేష్ రెడ్డి తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కొప్పుల హరీశ్వర్ రెడ్డి గత 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్ గా, ఎస్ ఎఫ్ సి చైర్మన్ గా బి ఆర్ ఎస్ పోలిట్ బ్యూరో సభ్యులుగా ఎన్నో కీలక పదవులు చేశారు. సర్పంచ్ గా మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం అంచలంచలుగా ఎదిగి ఉమ్మడి రాష్ట్రంలో కూడా వివిధ రాష్ట్రస్థాయి పదవులు చేపట్టి నియోజకవర్గ ప్రజలకు ఎనలేని సేవలందించారు..

హరీశ్వర్ రెడ్డి రాజకీయ చరిత్ర..
జననం : కొప్పుల హరీశ్వర్ రెడ్డి 18 మార్చి 1947లో తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, పరిగి గ్రామంలో జన్మించాడు..
రాజకీయ జీవితం కొప్పుల హరీశ్వర్ రెడ్డి 1972 నుంచి 1977 వరకు పరిగి ఉప సర్పంచ్‌గా, 1977 నుంచి 1983 వరకు సర్పంచ్‌గా పని చేశాడు. ఆయన 1983లో స్వతంత్ర అభ్యర్థిగా పరిగి నియోజకవర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అహ్మద్ షరీఫ్ చేతిలో 56 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చెందాడు. కొప్పుల హరీశ్వర్ రెడ్డి 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి, 1985లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పరిగి నియోజకవర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అహ్మద్ షరీఫ్ పై 32512 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.
ఆయన 1986 – 1988 వరకు ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా 1988 – 1989 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడిగా కూడ పని చేశాడు. కొప్పుల హరీశ్వర్ రెడ్డి 1994 , 1999, 2004 , 2009లో పరిగి నియోజకవర్గం నుండి పోటీ చేసి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1997 – 2003 వరకు రాష్ట్ర ఆర్ధిక సంస్థ అధ్యక్షుడిగా, 31 డిసెంబర్ 2001 నుండి 14 నవంబర్ 2003 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా పని చేశాడు.
ఆయన తెలంగాణ ఉద్యమం సమయంలో 15 నవంబర్ 2012లో తెలుగుదేశం పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి పార్టీ టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నియమితులయ్యారు. హరీశ్వర్ రెడ్డి 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి.రామ్మోహన్ రెడ్డి చేతిలో 5163 ఓట్ల తేడాతో ఓటమి చెందాడు. ఆయన 77 సంవత్సరాల సుదీర్ఘ జీవితకాలంలో ప్రజలకు ఎనలేని సేవలు అందించిన గొప్ప మహా నాయకుడు ఇక లేరని తెలుపుటకు పరిగి ప్రజలు దుఃఖ సాగరంలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement