Sunday, November 24, 2024

RIP – జనగామ జడ్పీ ఛైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి గుండెపోటుతో కన్నుమూత – కెసిఆర్, కేటీఆర్ సంతాపం

జనగామ జడ్పీ ఛైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి గుండెపోటుతో మరణించారు. హనుమకొండలోని రోహిణి అనే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. పాగాల సంపత్‌రెడ్డి ప్రస్తుతం జనగామ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అయితే, పాగాల సంపత్ రెడ్డికి హనుమకొండలోని చైతన్యపురిలో ఉండగా సాయంత్రం 5:30కి చాతిలో నొప్పి వస్తుందంటూ వ్యక్తిగత సిబ్బందికి చెప్పడంతో ఆసుపత్రికి సన్నిహితులు తరలించారు.

ఆ తర్వాత చికిత్స పొందుతూ ఆయన మరణించారు. కాగా, సంపత్ రెడ్డి జనగామ నుంచి బీఆర్ఎస్ తరపున బరిలో నిలిచిన పల్లా రాజేశ్వర్రెడ్డి గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో అహర్నిశలు కృషి చేశారని స్థానిక పార్టీ నేతలు తెలిపారు. సంపత్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు

బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి మృతి పట్ల భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సంతాపాన్ని ప్రకటించారు. సంపత్ రెడ్డి మరణం బాధాకరమన్న కేటీఆర్, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. బీఆర్ఎస్ పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందన్నారు.

బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందడం పట్ల బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.తెలంగాణ ఉద్యమంలో తొలినాళ్ల నుంచి తన వెంట నడిచిన యువ నేత సంపత్ రెడ్డి మరణం బాధాకరమని కేసీఆర్ అన్నారు.వారి కుటుంబ సభ్యులకు పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు. శోకంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement