Monday, July 1, 2024

RIP – డిఎస్ మృతి.. కేంద్ర మంత్రులు కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్ సంతాపం – నివాళులర్పించిన నేతలు..

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత డి.శ్రీనివాస్‌ మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజాసేవకు అంకితమయ్యారని పేర్కొన్నారు. 2004-2009 వరకు అసెంబ్లీలో డీఎస్‌ ప్రోత్సాహం మరువలేనిదన్నారు. డి.శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బంజారా హిల్స్ లోని డిఎస్ స్వ‌గృహానికి వెళ్లిన కిష‌న్ రెడ్డి డిఎస్ పార్దీవ దేహంపై పుష్ప గుచ్చాలు ఉంచి నివాళుల‌ర్పించారు..

బండి సంజ‌య్….
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి, పీసీసీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ మరణం బాధాకరం. ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా, రెండు సార్లు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా డీఎస్ అందించిన సేవలు ఎనలేనివి. బ్యాంకు ఉద్యోగిగా జీవితాన్ని ఆరంభించిన డీఎస్ రాజకీయాల్లో చేరి అంచెలంచెలుగా ఎదిగి రెండుసార్లు పీసీసీ అధ్యక్షులుగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యులుగా సేవలందించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో డి.శ్రీనివాస్ పాత్ర మరువలేనిది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హామీని 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపర్చడంతోపాటు, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పార్టీ అధిష్టానాన్ని ఒప్పించడంలో డీఎస్ చేసిన క్రుషి మరువలేనిది. బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం డి.శ్రీనివాస్ నిరంతరం పాటుపడేవారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటు. డీఎస్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం చేకూర్చాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నా అంటూ బండి త‌న సంతాప సందేశంలో పేర్కొన్నారు.

- Advertisement -

విహెచ్ సంతాపం

డి.శ్రీనివాస్ భౌతికగాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన మాజీ ఎంపీ వి.హనుమంతరావు..అనంత‌రం వారి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు..

కెసిఆర్ సంతాపం…

మాజీ మంత్రి డి శ్రీనివాస్ మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

కెటిఆర్ సంతాపం…

మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డి. శ్రీనివాస్ భౌతికకాయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా నివాళులర్పించారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతాపం…

మాజీ పీసీసీ అధ్యక్షులు డి. శ్రీనివాస్ అకాల మరణం పట్ల రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి, మాజీ టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. డీఎస్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్

బంజారాహిల్స్ లోని వారి నివాసంలో మాజీ మంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పార్థివ దేహానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.

భట్టి నివాళి..

శ్రీనివాస్ మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బంజారా హిల్స్ లోన డిఎస్ నివాసానికి మంత్రి దుద్దిళ్లతో కలసి వెళ్లిన ఆయన ముందుగా డిఎస్ బౌతిక కాయంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు.. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.. వారికి ధైర్యం చెప్పారు.

మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు

శ్రీనివాస్ మృతి పట్ల మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మంత్రిగా, ఏపీ పిసిసి అధ్యక్షుడిగా వారు చేసిన సేవలను మంత్రి గుర్తు చేసుకున్నారు. డీ.ఎస్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని ప్రార్థించారు .

హ‌రీశ్ రావు…
డీఎస్‌ మృతి పట్ల మాజీ మంత్రి, భారాస నేత హరీశ్‌రావు నివాళి అర్పించారు. మంత్రిగా, ఎంపీగా డీఎస్‌ సుదీర్ఘ కాలం సేవలందించారని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్

శ్రీనివాస్ మృతికి మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు.క్రిందిస్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నతస్థాయి కి చేరుకున్నార‌ని, ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషించార‌ని పేర్కొన్నారు.. శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు.

సంతాపం ప్రకటించిన మధుయాష్కి గౌడ్

కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షులు డి. శ్రీనివాస్ మృతి పట్ల టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ సంతాపాన్ని ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి డి శ్రీనివాస్ విశేష కృషి చేశారని, కాంగ్రెస్ పార్టీకి ఆయన అందించిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా ఆయన సమర్థవంతంగా పనిచేశారన్నారు.

మహేష్ కుమార్ గౌడ్ సంతాపం..

మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రి, డీఎస్ రాజకీయాలలో అపార అనుభవం ఉన్న నేత అని, బడుగు బలహీన వర్గాలు కోసం ఆయన ఎంతో శ్రమించారని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. డీఎస్ తో నాకు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.

వి ప్రశాంత్ రెడ్డి సంతాపం

వేల్పూర్ గ్రామ వాసి డి. శ్రీనివాస్ గారి మరణం నాకు వ్యక్తి గతంగా బాధను కలిగించింది. సామాన్య కార్యకర్త నుండి పీసీసీ అధ్యక్షుడి వరకు ఆయన అంచెలంచెలుగా ఎదిగిన తీరు నేటి రాజకీయాలకు ఆదర్శం. నా సొంత గ్రామమైన వేల్పూర్ వాస్తవ్యులైన డి.శ్రీనివాస్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా అనేక అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. రాజకీయ పార్టీలు వేరైనా మా తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి గారికి సన్నిహితులుగా ఉండేవారు. వారి మరణం నిజామాబాద్ జిల్లా ప్రజలకు,రాజకీయాలకు తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని, డి.శ్రీనివాస్ గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. – – వేముల ప్రశాంత్ రెడ్డి , ఎమ్మెల్యే బాల్కొండ,

శ్రీనివాస్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి – ఎపి మంత్రి నాదెండ్ల

మాజీ మంత్రి శ్రీ డి.శ్రీనివాస్ గారి మరణం బాధాకరం. ఆయన అత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన శ్రీనివాస్ ప్రజా జీవితంలో మూడున్నర దశాబ్దాలపాటు ఉన్నారు. రాష్ట్ర మంత్రిగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నో సేవలందించారు. ఉమ్మడి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. .శ్రీనివాస్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. – నాదెండ్ల మనోహర్.. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, ఎపి

Advertisement

తాజా వార్తలు

Advertisement