నర్సంపేట (ప్రభ న్యూస్): ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల్లో మార్పులు జరుగుతున్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో నిన్నటి వరకు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని అనుకున్న మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్లు సమాచారం అందుతోంది. ఇవ్వాల (ఆదివారం) రేవురిని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు కలిసి పార్టీ మార్పు గురించి చర్చించినట్టు తెలుస్తోంది. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
అయితే.. ఈ సందర్భంగా నర్సంపేట నుంచి రేవురి టికెట్ ఆశిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా అందుకు సానుకూలంగా ఉందని, ఒకవేళ నర్సంపేటలో వీలు కాకపోతే పరకాలలో నుంచి అయినా పోటీ చేయాలని రేవంత్ రెడ్డి కోరినట్టు తెలుస్తోంది.
ఇక.. నిన్నటి దాకా బీజేపీ అని తిరిగిన రేవూరి ఇప్పుడు సరికొత్త రాగం అందుకోవడంతో బీజేపీకి కొత్త తలనొప్పులు వచ్చిపడ్డాయి. కొద్ది రోజుల క్రితం రేవూరి చేసిన పలు చర్యల మూలంగా పార్టీ తీవ్రంగా నష్టపోవడమే కాకుండా, పలువురు పార్టీని విడిచి వెళ్లినట్టు తెలుస్తోంది. మొదటి నుండి కూడా రేవూరి ప్రకాశ్ రెడ్డి, రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నారనే ప్రచారం ఈ ఏరియాలో జోరుగా సాగగా.. ఇప్పుడు అది కాస్త నిజమైనట్లు పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.