హైదరాబాద్, ఆంధ్రప్రభ : అంగన్వాడీ సేవలపై చిన్నారుల పేరెంట్స్ ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని, ప్రతి నెలలో ఒకసారి ఫోన్ ఇన్ విత్ పేరెంట్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గురువారం ఎర్ర మంజిల్‌లోని మిషన్ భగీరథ కార్యాలయంలో పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పనుల పురోగతి, నూతన ప్రణాళికలు, పనితీరు మెరుగుదలపై చర్చించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రజాపాలనలో ప్రజల సంక్షేమమే లక్ష్యమన్నారు. అర్హులైన ప్రతి గర్భిణీ, బాలింత, చిన్నారికి పౌష్టికాహారం అందించేందుకు జిల్లా సంక్షేమ అధికారులు కృషి చేయాలన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో గర్భీణుల కోసం బెంచీలు
మంత్రి సీతక్క మాట్లాడుతూ తల్లి దండ్రుల అభిప్రాయాల మేరకు అంగన్వాడీ సిబ్బందిపై చర్యలు ఉంటాయని, అంగన్వాడీకి వచ్చే గర్భిణీలు కింద కూర్చోవడానికి ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందులను తొలగించే విధంగా అంగన్వాడీ కేంద్రాల్లో బెంచీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. దివ్యాంగుల పరికరాల కోసం తెలంగాణ చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ప్రతి నియోజకవర్గంలో డ్రైవ్ నిర్వహించి దివ్యాంగులకు పరికరాలను అందజేస్తామని చెప్పారు. అధికారులంతా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా పని చేయండని స్పష్టం చేశారు.
ఎవరూ తప్పులు చేయొద్దు!
మా మెప్పుకోసం వాస్తవాలను దాచి పెట్టొద్దని..అధికారులు, అమాత్యులు వేరు వేరు కాదన్నారు. మీరు పొరపాట్లు చేసి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేయవద్దన్నారు. ఎవరూ తప్పులు చేయొద్దు, జైలు పాలు కావద్దని సూచించారు. కింది ఉద్యోగులతో సంప్రదింపులు జరపండి, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పెండింగ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైందని, ఉపాధి హామీ పథకం రూ. 300 కోట్ల బిల్లులను విడుదల చేశామని, మల్టీ పర్పస్ వర్కర్ల వేతన బకాయిలను విడుదల చేశామని వెల్లడించారు. పంచాయతీరాజ్ శాఖ తరహాలోనే ప్రతి విభాగంలో ఉద్యోగ సమస్యలను ఆన్లైన్ లో పరిష్కరించే విధానాన్ని అవలంబించాలని ఆదేశించారు.