భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో శనివారం సంభవించిన అగ్ని ప్రమాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. మధిరలోని క్యాంపు కార్యాలయంలో జెన్‌కో థర్మల్ డైరెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లతో ప్రమాదంపై ఆరా తీశారు.
పిడుగుపాటు కారణంగా జరిగిన ప్రమాదంలో వాటిల్లిన నష్టంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం తీవ్రత పెరుగకుండా కేవలం గంటలోనే మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు డిప్యూటీ సీఎంకు అధికారులు వివరించారు. సమీపంలో ఉన్న హెవీ వాటర్ ప్లాంట్ మణుగూరు, పినపాక, అశ్వాపురంల నుంచి ఫైర్ ఇంజిన్లను రప్పించి మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని తనిఖీ చేయడానికి సోమవారం భోపాల్ నుంచి బీహెచ్ఈఎల్ బృందం వస్తున్నట్లు పేర్కొన్నారు.
నిపుణుల పరిశీలన అనంతరం నష్టానికి సంబంధించిన అంచనా వస్తుందని పేర్కొన్నారు. అయితే, ప్రమాదంపై సమగ్ర నివేదిక తయారు చేసి ఇవ్వాలని అధికారులకు భట్టి ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని జెన్‌కో థర్మల్ డైరెక్టర్ లక్ష్మయ్య, చీఫ్ ఇంజినీర్ రత్నాకర్, బిచ్చన్నలను ఆదేశించారు.