Monday, November 25, 2024

Revenge Politics – ధ‌ర‌ణిపై కేంద్రం త‌పాలాస్త్రం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సర్కార్‌ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తోందనేందుకు అనేక ఉదాహరణలు సాక్ష్యంగా నిలుస్తుండగా మరో ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకంగా అమలులోకి తెచ్చి రైతులకు సహాయకారిగా నిల్చిన ధరణి పోర్టల్‌ ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నాలకు దిగుతోందనే విమర్శలు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 11,53,58,755 మంది వీక్షించిన ఈ పోర్టల్‌ కోట్లాది మందికి ప్రయోజనకారిగా సేవలంది ంచింది. అయితే ప్రభుత్వానికి ఈ పోర్టల్‌తో వస్తున్న మైలేజీ, మంచి పేరును చూసి కన్ను కుట్టిన విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయనే విమర్శలు పెరుగుతున్నాయి. ఇందుకు తాజాగా పాస్‌ పుస్తకాల చేరవేతలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన పోస్టల్‌ శాఖ చేస్తున్న జాప్యమే ఉదాహరణగా చెబుతున్నారు. గడచిన నాలుగు నెలలుగా రాష్ట్రంలో పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల పంపిణీని తపాలా శాఖ నిలిపివేసింది. గడచిన నాలుగు నెలలుగా రెవెన్యూ శాఖ నేరుగా తపాలా శాఖకు పాస్‌ పుస్తకాలను పంపినప్పటికీ అవి కొనుగోలుదారులకు చేరవేయడంలో నిర్లక్ష్యం ఎదురవుతోంది. ఇందుకు కారణాలు ఆరా తీయ గా ప్రభుత్వం కొంత మొత్తం బిల్లులు చెల్లించలేదని తపాలా శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన సర్కార్‌ మొత్తం బకాయిలు వెంటనే చెల్లించింది. అయినప్పటికీ సుమారు 70వేల నుంచి ఒక లక్ష పాస్‌ పుస్తకాలను బేగంపేట్‌లోని తపాలా కార్యాలయంలోనే పెట్టి ఉంచారు. కాగా పోస్టల్‌ శాఖకు చెల్లింపులు పూర్తయి నెల గడుస్తున్నా ఉన్నతాధికారుల నుంచి క్లియరెన్స్‌ రాలేదని అంటున్నారు. పెండింగ్‌ బకాయిలేవీ లేకున్నా పాస్‌ పుస్తకాల పంపిణీని నిలిపివేయడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పోస్టల్‌ శాఖ నిర్వాకం ఫలితంగా సుమారు లక్ష మంది రైతులకు చెందిన రిజిస్ట్రేషన్లు పూర్తయిన భూములకు చెందిన పాస్‌ పుస్తకాలు రైతాంగానికి చేరలేదు. దీంతో వారంతా ఇబ్బందులకు గురవుతున్నారు. కొందరు తిరిగి విక్రయించుకునేందుకు వీలులేకపోగా, రైతుబంధు, రైతు బీమాలకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. మరికొందరు రైతులు రుణాలను తీసుకునేందుకు పాస్‌ పుస్తకాలు లేక ఆపసోపాలు పడుతున్నారు. విభిన్న తరహాలో 55లక్షల కమతాలు, 71లక్షల వ్యవసాయ ఖాతాలకు పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు అందించడం, 1.24 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములకు చెందిన వివరాలను ధరణి వెబ్‌సైట్‌లో పొందుపర్చిన సర్కార్‌ మానవ ప్రమేయం లేకుండా ఎటువంటి లంచాలు లేని వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో 1,12,077 చదరపు కిలోమీటర్ల భూభాగం ఉండగా ఇందులో 2.80 కోట్ల ఎకరాల భూభాగపు లెక్కలు డిజిటలైజ్‌ చేశారు. భూ రికార్డులకు సమగ్రమైన విధానంతో మరింత స్పష్టత వచ్చింది.

అవినీతికి ఆస్కారం లేని పారదర్శకమైన నూతన రిజిస్ట్రేషన్‌ విధానం నాటి నుంచి అమలులోకి రావడంతో రెవెన్యూ శాఖ పరిధిలోనే భూముల నిర్వహణ, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏకకాలంలో ఒకే కార్యాలయంలో జరుతున్నాయి. ప్రతి ఎకరం భూభాగం వివరాలు ధరణి వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ అవడంతోపాటు, మొత్తం తెలంగాణ భూభాగం ప్రతి అంగుళం ఇందులో నిక్షిప్తమైంది. క్రయవిక్రయాలు, యాజమాన్య మార్పులను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తుండటంతో గత అస్పష్టతలు దూరమయ్యాయి. రిజిస్ట్రేషన్‌ వివరాలు, పేరు మార్పిడి వివరాలు ఏరోజుకారోజే ధరణిలో నమోదుతో మండల కార్యాలయం నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయిలో అన్ని చోట్లా ఈ వెబ్‌సైట్‌ నుంచే ఎవరైనా కావాల్సిన వివరాలు పొందుతున్నారు. విదేశాల్లో ఉన్న ఎన్నారైలు కూడా ధరణి ద్వారా అందే సమాచారంతో క్రయ, విక్రయాలు జరుపుకునే వీలు కల్గింది.

నకిలీల నివారణ…
భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, భూ రికార్డుల నిర్వహణలో నూటికి నూరు శాతం పారదర్శకత సాధించడం, అవినీతిని నిరోధించడం, నకిలీ పాస్‌పుస్తకాలను అరికట్టడం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రైతులు, ఇతరులు తరచూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఒక్క రోజులో మొత్తం పని పూర్తిచేసి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వం ధరణిని రూపొందించింది. నకిలీ పాస్‌పుస్తకాలు, ఇతర డాక్యుమెంట్లు లేకుండా ఈ వెబ్‌సైట్‌తో కట్టడి చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement