Tuesday, November 26, 2024

Delhi | రేవంత్ మాటలు వక్రీకరించారు.. బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోంది: మాణిక్​రావ్​ ఠాక్రే

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రైతులకు ఉచిత విద్యుత్ అంశంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అమెరికాలో చేసిన వ్యాఖ్యలను భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ వక్రీకరించి దుష్ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావ్ థాక్రే ఆరోపించారు. బుధవారం ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ బీఆర్ఎస్ పార్టీతో పాటు సీఎం కే. చంద్రశేఖర రావుపై విరుచుకుపడ్డారు. ఏఐసీసీ కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) వంశీచంద్ రెడ్డి, తెలంగాణ వ్యవహారాల సహ ఇంచార్జి రోహిత్ చౌదరి కూడా ఈ మీడియా సమావేశంలో ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ శరవేగంగా బలపడుతోందని, దాన్ని అడ్డుకోవడం కోసమే కేసీఆర్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని థాక్రే మండిపడ్డారు.

బీఆర్ఎస్ నేతల తప్పుడు ప్రచారాల ముసుగు త్వరలోనే తొలగిపోతుందని అన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ రైతుల పక్షమే నిలిచిందని, భవిష్యత్తులోనూ ఇది కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తుతో పాటు రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్‌లో పేర్కొన్న అన్ని అంశాలను కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేస్తుందని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రసంగం పూర్తిగా వింటే ఆయన ఏమన్నారో తెలుస్తుందని, కొంత భాగం మాత్రమే వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

అదే సమయంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో నెలకొన్న వివాదంపైనా స్పష్టత ఇచ్చారు. అమెరికాలో జరిగిన ఎన్‌ఆర్‌ఐల సమావేశంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ములుగు ఎమ్మెల్యే సీతక్క పేరును తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు పార్టీలో చిచ్చు రేపాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి సీనియర్ నేతలు బహిరంగంగానే తమ అసహనాన్ని ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారని, అదే కాంగ్రెస్ సాంప్రదాయమని థాక్రే వెల్లడించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురి పేర్లను ప్రస్తావిస్తూ పార్టీలో ముఖ్యమంత్రి రేసులో చాలా మందే ఉన్నారని చెప్పుకొచ్చారు. అందరికీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.

తెలంగాణ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, రైతులకు కేసీఆర్ సర్కారు ఇస్తున్న దాని కంటే ఎక్కువే ఇస్తుందని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఒకప్పుడు కాంగ్రెస్ పేరు ఎత్తడానికే ఇష్టపడని కేసీఆర్ ఇప్పుడు పదే పదే కాంగ్రెస్ పేరు ఎత్తుతూ విమర్శిస్తున్నారని, కాంగ్రెస్ ఎదుగుదలకు ఇదే నిదర్శనమని అన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఆయన కుటుంబ సభ్యులకు తప్ప సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు.

- Advertisement -

జనం కోసం ఏమీ చేయకపోయినా ప్రచారం మాత్రం బాగా చేసుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో రైతు బీమా అమలుకావడం లేదని అన్నారు. కేసీఆర్ ఇచ్చిన రుణమాఫీ హామీ ఎటుపోయిందని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్తుతో పాటు రైతులకు చత్తీస్‌గఢ్ తరహాలో మెరుగైన మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు కాంగ్రెస్‌పై నమ్మకం ఉందని, బీజేపీ – బీఆర్ఎస్ ఒకటేనన్న విషయం ప్రజలకు కూడా తెలుసని థాక్రే వ్యాఖ్యానించారు.

రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.. బీఆర్ఎస్ పతనం ప్రారంభం : ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు, బీఆర్ఎస్ పతనం ఖాయమైందని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి అన్నారు. అంబానీ, అదానీకి దోచిపెడుతున్న బీజేపీ, సొంత కుటుంబ సభ్యులకు దోచిపెడుతున్న బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా సరే కాంగ్రెస్ గెలుపును ఆపలేరని అన్నారు. డిసెంబర్‌లో తెలంగాణలో, వచ్చే ఏడాది దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. తెలంగాణలో ప్రతి రైతుకు 24 గంటలు ఉచితంగా విద్యుత్ ఇస్తామని పునరుద్ఘాటించారు.

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రూ. 1 లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పారని, కానీ అది అమలు కాలేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏకబిగిన రూ. 2 లక్షల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. అలాగే రైతులకు ఎకరానికి రూ. 15 వేల ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు కౌలు రైతులకు ఇందిరమ్మ రైతు భరోసా కింద రూ. 12 వేల ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలు, ఇతర పార్టీల్లోని నేతలు కాంగ్రెస్ వైపే చూస్తున్నారని వంశీచంద్ అన్నారు. జూపల్లి కృష్ణారావుతో పాటు మరికొందరు నేతలు త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతున్నారని వెల్లడించారు. చాలామంది నేతలు బీఆర్ఎస్ వదిలి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపిన సంఘటనలో నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో భాగంగా ఉన్న కేసీఆర్‌కు రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement