Friday, November 22, 2024

TS | రేపు రేవంత్ కొడంగల్ పర్యటన..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అధికార బాద్యతలు చేపట్టిన రెండు నెలల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఉనుముల రేవంత్‌ రెడ్డి తొలిసారి సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గత రెండు రోజులుగా ఢిల్లి పర్యటనలో ఉన్న ఆయన బుధవారం కొడంగల్‌లో పర్యటిచనుట్లు సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. అందుకోసం అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. వేల కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తుండడంతో కొడంగల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (కడా) ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళిక సిద్దమైంది.

ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌ రెడ్డి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు కోస్గి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం రాత్రికి హైదరాబాద్‌కు చేరుకుంటారని అదికారులు తెలిపారు. కాగా ఇదివరకే తన సొంత సెగ్మెంట్‌లో పర్యటించాలని రేవంత్‌ రెడ్డి నిర్ణయించినా వివిధ కారణాలతో చివరి నిమిషంలో రెండు సార్లు వాయిదా పడింది. ఈ క్రమంలో తాజాగా ఖరారైన పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ యోగేస్‌ గౌతమ్‌, కలెక్టర్‌ కోయ హర్ష, వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ పి.నారాయణ రెడ్డి, కొడంగల్‌ ఏరియా డెవలప్మెంట్‌ అధికారురులు పరిశీలించారు. కోస్గి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే భారీ బహిరంగ సభలో కొడంగల్‌ ప్రజలతో మాట్లాడతారు. రూ.2,945 కోట్లతో నిర్మించనున్న నారాయణపేట -కొడంగల్‌ ఎత్తిపోతల పథకం, 360 కోట్లతో ప్రభుత్వ వెటర్నరీ కాలేజీకి, 344.5 కోట్లతో డబుల్‌ రోడ్లకు,బ్రిడ్జి నిర్మాణాలకు, 224.50 కోట్లతో మెడికల్‌, నర్సింగ్‌, ఫిజియోథెరపీ కాలేజీలకు, కొడంగల్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో 220 బెడ్లతో, టీచింగ్‌ కాలేజీకి, 213.20 కోట్లతో పంచాయతీరాజ్‌ రోడ్లకు, 40 కోట్ల ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ సీసీ రోడ్లకు, 30 కోట్లతో గవర్నమెంట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీకి, 27.86 కోట్లతో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మంజూరైన బీటీ రోడ్లకు, 14.26 కోట్లతో బొంరాస్‌ పేట్‌, దౌల్తాబాద్‌ మండలాలలో జూనియర్‌ కళాశాలలకు నిధులు కేటాయించారు.

దీంతో పాటు 25 కోట్లతో మైనార్టీ వెల్ఫేర్‌ పాఠశాలకు ,25 కోట్లతో మహాత్మ జ్యోతిరావు పూలే ట్రైబల్‌, బిసి పాఠశాల, కాలేజీకి, 11 కోట్లతో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు,6.8 కోట్లతో కొడంగల్‌ లో ఆర్‌ ఎండి అతిథిగృహంకు, 5 కోట్లతో కొడంగల్‌లో హాస్టల్‌ నిర్మాణానికి, వీటితోపాటు సబ్‌ స్టేషన్ల ఏర్పాటుకు, పాలిటెక్నిక్‌ హాస్టల్‌ కు సంబంధించిన వాటికి సుమారు 4,324.117 కోట్ల పనులకు సీఎం రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని జిల్లా అధికారులు తెలిపారు. కొడంగల్‌ అభివృద్ధికి ఎక్కువ మొత్తంలో నిధులు విడుదల చేసినందుకు సీఎంకు నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞతలు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement