Saturday, September 21, 2024

TG: రుణమాఫీ పేరిట రేవంత్ మోసం.. మాజీ మంత్రి వేముల

ఉమ్మడి నిజామాబాద్, ప్రభ న్యూస్ బ్యూరో : రుణమాఫీ పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. భేషరతుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఒక్క రైతుకు రూ.రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ మోసంపై ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తో కలిసి ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే డిసెంబర్ 9న పూర్తిగా రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి మొదటిసారి రైతులను రేవంత్ రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. 100 రోజుల్లో రుణమాఫితో పాటు ఇచ్చిన హామీలనన్నిటిని నెరవేరుస్తానని చెప్పి రెండవసారి రైతులను మోసం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మళ్లీ మాట తప్పి పార్లమెంట్ ఎన్నికల్లో ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానని ఓట్లు దండుకొని మూడోసారి రేవంత్ రెడ్డి మోసం చేశారన్నారు.

ఎక్కడికెళ్తే అక్కడ దేవుళ్ళ పై ప్రమాణం చేసి ఎన్నికల్లో గెలిచిన రేవంత్ రెడ్డి దేవుళ్లను కూడా మోసం చేయడం సిగ్గుచేటన్నారు. ఆగస్టు 15 దాటినప్పటికీ రైతుబంధు ఇవ్వకుండా రుణమాఫీ పేరిట కొంతమంది రైతులకే వర్తింపజేశారని ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడవ విడత రుణమాఫీ రైతుల జాబితా నేటికి రాలేదని ప్రశాంత్ రెడ్డి అన్నారు. దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పిన వ్యక్తిని నా జీవితంలో చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంగా రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ప్రజల మీద ఒట్టేసి అబద్ధాలు చెప్తుంటే అబద్దమే ఆత్మహత్య చేసుకుంటుందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి దేవుళ్ళపై ఒట్టేసినందుకు దేవుళ్ళు శాపం పెడతారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ పాపానికి ప్రజలను శిక్షించవద్దని దేవుళ్లను వేడుకున్నారు. ఇంతటి నీచాతి నీచమైన ముఖ్యమంత్రి దేశంలో ఎవరూ లేరన్నారు. రూ. 31 వేల కోట్ల రుణమాఫీ అవసరం ఉండగా కేవలం రూ.17,900 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసి చరిత్ర తిరగరాసానని అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైరా సభలో రుణమాఫీ కింద రూ.31 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని సీఎంగా అబద్ధం చెప్పారని మండిపడ్డారు. లెక్కల ప్రకారం రూ.17,900 కోట్లు మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా రుణమాఫీ చేసిన విషయాన్ని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. రుణమాఫీ చేయకపోయినా హరీష్ రావును రాజీనామా చేయమని మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు. రుణమాఫీతో పాటు ఆరు గ్యారంటీలు, 13 హామీలు వందరోజుల్లో పూర్తిచేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు సవాల్ చేసిన విషయాన్ని ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు. రుణమాఫీ పూర్తి చేయకపోగా, హామీలు అటకెక్కగా హరీష్ రావు రాజీనామా ఎట్లా చేస్తారని ప్రశ్నించారు. ఉచిత బస్సు మినహా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. రూ.4000 పింఛను, నిరుద్యోగులకు ఉద్యోగాలు, మహిళలకు 2500,నిరుద్యోగ భృతి, కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇలా అనేక హామీలు ఇచ్చి మాట తప్పిన రేవంత్ రెడ్డి ఇంకా దిగజారి మాట్లాడుతున్నారని ప్రశాంత్ రెడ్డి అన్నారు.

- Advertisement -

హరీష్ రావు సవాల్ తో కొందరికైనా రుణమాఫీ జరిగిందని అన్నారు. తాటి చెట్టంత మనిషి హరీష్ రావు ఉద్యమంలో సిపాయిల కొట్లాడం వల్లే తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లతోపాటు నాలాంటి ఎందరో ఉద్యమం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం సాధించామని అన్నారు. అలాంటి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నేడు పదవిలో రేవంత్ రెడ్డి ఉన్న విషయం మర్చిపోవద్దన్నారు. రేవంత్ రెడ్డి కంటే పిట్టలదొర మాటలే నయమని ఎద్దేవా చేశారు. కనీస మానవత్వం లేని కిరాతకుడు రేవంత్ రెడ్డి అని, సంస్కారం లేని అజ్ఞాని అని వేముల ఘాటుగా విమర్శించారు. రేవంత్ రెడ్డి సీమాంధ్ర నాయకుల మోచేతి నీళ్లు తాగిన ఉద్యమ ద్రోహి అని ఎద్దేవా చేశారు. సీమాంధ్ర అడుగులకు మడుగులెత్తిన తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి అని విమర్శించారు.

కేసీఆర్ సర్కార్ చేసిన రుణమాఫీలో రేవంత్ రుణమాఫీ ఎంత ?
రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ రైతులను నిలువునా మోసం చేసిందని ప్రశాంత్ రెడ్డి లెక్కలతో సహా వివరించారు. 2016లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 3 లక్షల 79 వేల 520 మంది రైతులకు రూ.1571.25 కోట్ల రుణమాఫీ చేస్తే, 2024లో రేవంత్ రెడ్డి సర్కార్ ఉమ్మడి జిల్లాలో కేవలం రూ.1281 కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారని చెప్పారు. మొత్తం 3 లక్షల 79 వేల 520 మంది రైతులకు రుణమాఫీ వర్తింపజేయాల్సి ఉండగా కేవలం 1లక్ష 76 వేల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారని చెప్పారు. ఇంకా 2 లక్షల 3 వేల520 మంది రైతులకు రుణమాఫీ చేయలేదని ప్రశాంత్ రెడ్డి వివరించారు. ఈ లెక్కన 2016 లోనే కెసిఆర్ సర్కార్ ఇచ్చిన రుణమాఫీలో రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చింది ఎంత అని ప్రశ్నించారు. రుణమాఫీ పై రేవంత్ రెడ్డి సర్కార్ రైతులను నిలువునా మోసం చేయడాన్ని నిరసిస్తూ ఎలాంటి షరతులు లేకుండా లోన్ తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ పై శనివారం రోజున వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద రైతులతో కలిసి ఉదయం 10.00 గంటలకు నిర్వహించే ధర్నాను బాల్కొండ నియోజకవర్గంకు చెందిన రైతులు పెద్ద ఎత్తున హాజరై రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తేవాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ నాయకులు కొత్తూరు లక్ష్మారెడ్డి, నుడా మాజి చైర్మన్ ప్రభాకర్ రెడ్డి,సుజిత్ సింగ్ ఠాకూర్, మురళి, సత్యప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement