మక్తల్, నవంబర్ 27(ఆంధ్రప్రభ) : తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంలో.. వరంగల్ లో ప్రజాపాలన ఉత్సవం తర్వాత.. పాలమూరులో రైతుల పండుగ కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. ఇవాళ మక్తల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో భాగంగా మాట్లాడుతూ… పాలమూరు వేదికగా రైతన్నల కోసం రైతు పండగ కార్యక్రమాన్ని ఈనెల 28నుంచి 30వ తేదీ వరకు మూడురోజుల పాటు నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతులు వారి జీవన విధానం, టెక్నాలజీను ఉపయోగించి మరింతగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చేసిన కార్యక్రమానికి జిల్లా ఇన్ చార్జిగా తనను నియమించారని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతాంగానికి పిలుపునిస్తున్నామని, 28, 29, 30వ తేదీ మధ్యాహ్నం వరకు దాదాపు 60 స్టాల్స్ ఏర్పాటు చేసి, వ్యవసాయంలో నిష్ణాతులైన వారిని పిలిపించి, రైతులకు డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేసి వ్యవసాయంలో ఆధునాతన పద్దతులపై అవగాహన కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. అత్యాధునిక పనిముట్లు, ఇతర సాంకేతికత ఉపయోగించి, వ్యవసాయంతో దిగుబడి ఎక్కువ సాధించే దిశగా కార్యక్రమం ఉంటుందన్నారు. రైతులందరికీ వసతి, భోజన సదుపాయంతోపాటు రవాణా సౌకర్యం పూర్తిగా ఉచితంగా కల్పిస్తున్నామని.. పూర్తిగా రైతన్నల కోసం వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడమే ధ్యేయంగా చేపడుతున్నామని, జిల్లా వ్యాప్తంగా రైతన్నలు పెద్దఎత్తున కార్యక్రమానికి తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
గతంలో ఎప్పుడూ చెల్లించని విదంగా సుమారు 19వేల కోట్లకు పైగా నిధులు రుణమాఫీ కింద రైతులకు చెల్లించామని, ఇంకా దాదాపు 9500 కోట్లు చెల్లిస్తామని అన్నారు.మక్తల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలు, మూడు మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటివరకు రుణమాఫీ కింద రైతులకు 325 కోట్ల రూపాయలు చెల్లించామని… ఇంకా కొంతమంది రైతులకు చెల్లించాల్సి ఉందని… బ్యాంకర్లతోపాటు 2 లక్షలపైన ఉన్న వారికి సీఎం ఆధ్వర్యంలో బ్యాంకు అధికారులకు సూచనలు అందించి, వారికి సైతం రుణమాఫీ అందేవిధంగా చర్యలు చేపడతామన్నారు.
మాగనూరు ఘటనపై రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేద్దాం…
మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో జరిగిన సంఘటనపై గతంలోనే స్పందించి ఏజెన్సీలతోపాటు సంబంధిత వారిపై చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే తెలిపారు. తిరిగి మంగళవారం సైతం సంఘటన జరగడంపై స్పందిస్తూ….మక్తల్ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి పార్టీలకతీతంగా నాయకులు కలిసిరావాలని, అంతేగానీ సమస్యను భూతద్దంలో చూపెడుతూ, లేనిపోని ఇబ్బందులు సృష్టించి రాజకీయంగా లాభపడాలని చూస్తే నియోజకవర్గం నష్టపోతుందన్నారు. గతంలో వైద్యులు సైతం మక్తల్ ప్రాంతానికి రావడానికి ఎవరూ ఇష్టపడలేదన్నారు.
సమస్యలపై మాట్లాడుతూ.. పోయి రాద్దాంతం చేయడం తనకు ఇష్టం లేదని, దానివల్ల అటు విద్యార్థులకు, ఇటు ప్రజలకు ఎవరికీ లాభం లేదన్నారు. మఖ్తల్ ప్రాంతంపై ప్రేమ ఉన్న ప్రతిఒక్కరినీ వేడుకుంటున్నానని, అన్ని విభాగాల్లో సమస్యల పరిష్కారానికి తాను చిత్తశుద్దితో ఉన్నానని, అధికారులు, నాయకులు ఎవరు ఎలాంటి సలహాలు, సూచనలు ఇచ్చినా వాటిని స్వీకరించి, సమస్య పరిష్కారానికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. మంగళవారం మాగనూరులో ఏమ్మార్వో సమక్షంలో అధికారులు, పాత్రికేయులు సైతం భోజనం చేశారని అన్నారు.
దాదాపు 400మందిపైగా విద్యార్థులు తిన్నారని, కేవలం 20 మందికి మాత్రమే ఎందుకు ఇలా జరిగిందో పూర్తిస్తాయిలో ఎస్పీ ఆద్వర్యంలో విచారణ జరిపించాలని ఆదేశాలిచ్చామని అన్నారు. అసెంబ్లీలో సైతం ఇదే సమస్యపై ప్రస్తావించడానికి సిద్దమని, రాజకీయాలు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే చేద్దామని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలని, ఎవరూ అధైర్య పడవద్దని, రాష్ట్ర ప్రభుత్వం, తామందరం అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ నేతలు జి.లక్ష్మారెడ్డి, కట్టా సురేశ్ గుప్తా,మండలాధ్యక్షుడు గణేశ్ కుమార్, టౌన్ ప్రెసిడెంట్ బోయ రవికుమార్, చంద్రకాంత్ గోడ్ తదితరులు పాల్గొన్నారు.