Tuesday, November 26, 2024

నీళ్లు పారాల్సిన ప్రాజెక్టుల్లో నిర్వాసితుల కన్నీళ్లు పారుతున్నాయి.. గౌరవెల్లి ప్రాజెక్టు రేవంత్‌రెడ్డి ఆగ్రహం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల అరెస్టును టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఖండించారు. దాడులు , అరెస్టులు హేయమైన చర్య అని సోమవారం ఆయన ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ‘ నీళ్లు పారాల్సిన ప్రాజెక్టుల్లో నిర్వాసితుల కన్నీళ్లు పారుతున్నాయి. బీళ్లు తడవాల్సిన ప్రాజెక్టులు.. నిర్వాసితుల రక్తంతో తడుస్తున్నాయి. సిద్దిపేట జిల్లా గౌరవెల్లి- గుండిపెల్లి నిర్వాసితులపై అర్ధరాత్రి పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. వారికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్‌ అండగా ఉంటుంది ‘ అని రేవంత్‌రెడ్డి ట్వీట్‌ చేశారు.

నిర్వాసితులకు పూర్తిగా న్యాయం జరిగిన తర్వాతనే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలన్నారు. నిర్వాసితులు కోరుతున్న విధంగా ఆర్‌ అండ్‌ ఆర్‌ ఫ్యాకేజీ, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలన్నారు. లేదంటే నిర్వాసితుల పక్షాన కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమిస్తుందని ఆయన హెచ్చరించారు. భూ నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకోకుండా ఏళ్లతరబడి సమస్యను నాన్చుతూ కాలయాపన చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement