- కేసీఆర్ 1100 గురుకులాలు ఏర్పాటు చేశారు
- సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం రద్దు చేశారు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను విధ్వంసం చేసిందని మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. శనివారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన పాపానికి గురుకుల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు తీసుకువచ్చారన్నారు. గురుకులాల్లో చదువుతున్న వాళ్ళందరూ పేద, మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చిన వారేనని, వారిపై ప్రభుత్వం కక్ష కట్టడం దారుణమన్నారు. కార్పొరేట్ సంస్థలతో సీఎం కుముక్కయ్యారని, గురుకుల వ్యవస్థను విధ్వంసం చేశారన్నారు.
మీ అసమర్ధత వల్లనే భారత రాష్ట్ర సమితి గురుకులాల బాట పట్టాల్సి వచ్చిందన్నారు. మీ అసమర్ధ పాలన వల్ల అభం శుభం తెలియని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. కేసీఆర్ 1100 గురుకులాలు అందించి పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించారని, అటువంటి గురుకులాలను నిర్వీర్యం చేయడం సిగ్గుచేటన్నారు.
కేసీఆర్ అన్న వాళ్ళను చెరిపేస్తామని అనడం సిగ్గుచేటని, దీక్షా దివస్ తో పాటుగా గురుకుల బాట నిర్వహించి వాస్తవ పరిస్థితిని ప్రజలకు తెలియజేస్తామన్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు సరైనవి కాదని, బీఆర్ఎస్ నాయకులపై బురద చల్లడం మానుకొని గురుకుల విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ను రద్దు చేశారన్నారు. మధ్యాహ్న భోజనమంతా పురుగుల మయమైపోయిందని, స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధ్యాహ్న భోజనం పథకంలో నాసిరకం ఆహారాన్ని చూసి చలించిపోయారన్నారు. ఈ సమావేశంలో భారత రాష్ట్ర సమితి నాయకులు గెల్లు శ్రీనివాస్, బాలు, రవీందర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.