గోదావరిఖని, ఆగస్టు 15 (ప్రభన్యూస్): టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోలీస్ వ్యవస్థను కించపరిచేలా పోలీస్ అధికారులపై తీవ్ర అభ్యంతర వ్యాఖ్యలు చేయడం ఆక్షేపణీయమని రామగుండం పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లకుంట పోచలింగం ఒక ప్రకటనలో మండిపడ్డారు. పోలీసులకు తీవ్ర హెచ్చరికలు చేస్తూ, 100 రోజుల్లో ప్రభుత్వం మారుతుందని పోలీసుల పేర్లు రెడ్ డైరీలో నమోదు చేస్తున్నామని, సహకరించిన పోలీసుల గుడ్డలు విప్పదీస్తామని అభ్యంతరకర వ్యాఖ్యలు చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని గుర్తు చేశారు.
తమ రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు వ్యవస్థపై, అధికారులపై వ్యక్తిగత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. పోలీస్ అధికారులపై అసందర్భ వ్యాఖ్యలు చేస్తూ అధికారుల, సిబ్బంది మనోధైర్యాన్ని, మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి చర్యలు మానుకోవాలన్నారు. ప్రభుత్వాలు ఏవైనా, తెలంగాణ రాష్ట్ర పోలీసులు చట్టానికి లోబడి, చట్ట ప్రకారం పనిచేస్తామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించి, ప్రజాశాంతికి భంగం కలిగించే మూకలు ఏ పార్టీకి చెందిన వారైనా ఉపేక్షించకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. చట్ట ప్రకారం పనిచేస్తున్న పోలీసులను కించపరిచే మాటలు మాట్లాడి, పోలీసుల మనోభావాలు దెబ్బతీసిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ.. వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని కోరారు.