ఆగస్ట్ 15లోగా రుణమాఫీ చేస్తాం
తెలంగాణకు మామ అల్లుళ్ల పీడ విరగడ ఖాయం
బీజేపీ, బీఆర్ఎస్ లు రెండూ ఒక్కటే
ఒకరేమో చిల్లి గవ్వ ఇవ్వరు..
మరొకరేమే ఏడు లక్షల అప్పుతో టోకరా
ఈ ఫైనల్ ఎన్నికల్లో గుజరాత్ టీమ్ ను చిత్తు చేస్తాం..
కొత్తగూడెం – రైతు భరోసా అందిస్తే ముక్కు నేలకు రాస్తావా? అని కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పోరాటాల చరిత్ర ఖమ్మం ఎప్పుడూ ముందు వుంటుందన్నారు. 1969 తెలంగాణ ఉద్యమం ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభం అయిందన్నారు. 2014, 18, 23 మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించారన్నారు. కేసీఆర్ ని దుర్మార్గుడని ముందే గుర్తించిన జిల్లా ఖమ్మం అన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు రఘురామిరెడ్డి, బలరాం నాయక్‌లకు మద్దతుగా కొత్తగూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. నయవంచన, నక్కజిత్తుల, కాలకూట విషము అయిన కేసీఆర్ ను ముందే పసిగట్టినది ఖమ్మం జిల్లా అన్నారు. ఖమ్మం జిల్లా మిగిలిన జిల్లాలకు ఆదర్శం అన్నారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తాను ఎక్కువగా జోక్యం చేసుకోనని తెలిపారు. ఖమ్మం జిల్లాలోని ప్రతి కార్యకర్త ఒక్క ముఖ్యమంత్రిగా వుంటారని, వాళ్ళే ప్రచారానికి నాయకత్వం వహిస్తారని తెలిపారు. దేశ రాజకీయాలకు ఖమ్మం జిల్లా దిక్సూచి అన్నారు.
ఖమ్మం స్థానం నుంచి నామా గెలిస్తే సంకీర్ణంలో కేంద్ర మంత్రి అవుతారని కేసీఆర్ అంటున్నారని..కేంద్రంలోని ఏ సంకీర్ణ ప్రభుత్వంలో కేసీఆర్ చేరతారని రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్ బీజేపీలో చేరతారని తాము మొదటి నుంచి చెబుతున్నామన్నారు. కేంద్రంలో బీజేపీ చేసిన అన్ని చట్టాలకూ బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నాయన్నారు. ఢిల్లీలో తెలంగాణను తాకట్టు పెట్టింది కేసీఆరేనని అన్నారు. కారు కార్ఖానాకు పోయిందని, ఇక బయటకు వచ్చే సమస్య లేదన్నారు.
తెలంగాణకు అన్యాయం, ద్రోహం చేసింది బీజేపీ అన్నారు. తెలంగాణ ఏర్పాటును మోదీ అవమానించారన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి గట్టి వ్యక్తి కాబట్టి కేసీఆర్ ఎన్ని అప్పులు చేసినా రైతు బంధు, జీతాలు ఇస్తున్నారన్నారు. మే 9న అమర వీరుల సాక్షి వద్ద అప్పులపై చర్చ పెడుదాం రమ్మంటూ కేసీఆర్ కు రేవంత్ ఆహ్వానం పలికారు..కాగా, కేసీఆర్ ను నమ్మి మోసపోవద్దు అంటూ బీఆర్ఎస్ ఎంపీ, ఖమ్మం అభ్యర్ధి నామా నాగేశ్వరరావుకు సూచించారు…. ఆ కుటుంబాన్ని నమ్మవద్దంటూ హితవు పలికారు..
ఇదిలా ఉంటే సెమీ ఫైనల్ లో బీఆర్ఎస్ నీ ఓడించామని, మే 13 ఫైనల్స్ లో గుజరాత్ టీంను ఓడించాలన్నారు. మీ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ ను గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.. ఆగస్ట్ 15లోగా రెండు లక్షల రుణమాఫీ చేసి సిద్దిపేటలో హరీష్ కు బుద్ధి చెప్తామన్నారు. హరీష్ రావు పారిపోదామని ప్లాన్ వేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దింపుడు కళ్లెం ఆశ మాత్రమే అని, ఆ ఆశతో ఉపయోగం కూడా లేదన్నారు.
నమ్మించి మోసం చేయడంలో కేసీఆర్‌ను మించిన వారు లేరన్నారు. డిసెంబర్ 3న వచ్చినవి సెమీఫైనల్ ఫలితాలు మాత్రమే అని.. ఈ నెల 13న జరిగే ఫైనల్స్‌లో తమదే విజయం అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్‌ను ఓడిద్దాం.. తెలంగాణను గెలిపించుకుందామని సీఎం రేవంత్ ప్రజలకు పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని.. అత్యధిక మెజార్టీతో గెలిచే స్థానంగా ఖమ్మం నిలుస్తోందని కాంక్షించారు.
పదేళ్ల పాటు తెలంగాణకు ద్రోహం చేసింది బీజేపీయే అన్నారు. తెలంగాణకు గాడిదగుడ్డు ఇచ్చిన బీజేపీని కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు. రూ.7లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని కేసీఆర్ తమకు అప్పగించారని, ఆయనకూ ఈ ఎన్నికల ఆఖరివంటూ పేర్కొన్నారు… ఖమ్మంలో రఘురామిరెడ్డి, మహబూబాబాద్‌లో బలరాం నాయక్ గెలవాలన్నారు.