భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటన సంచలనం రేపుతోంది. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ రికార్డు చేసిన సెల్ఫీ వీడియో బయటకు రావడంతో ఈ వ్యవహారంపై రాజకీయ రంగు పులుముకుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవ తన భార్య గురించి అసభ్యంగా మాట్లాడారని బాధితుడు రామకృష్ణ తెలిపారు. తాజాగా ఈ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు.
ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ కీచక పర్వానికి ఓ కుటుంబం బలైందన్నారు. రామకృష్ణను వేధించిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వనమా వెంకటేశ్వరరావుతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాలన్నారు. రాఘవ కీచక చేష్టలను తట్టుకోలేకే రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుందన్నారు. రామకృష్ణను వేధించి.. అతని భార్యపై దారుణంగా మాట్లాడాడని అన్నారు. సెల్ఫీ వీడియో ద్వారా అతను చెప్పింది వింటే సభ్య సమాజం సిగ్గుపడే పరిస్థితి ఉందన్నారు. మనుషులు ఇంత దారుణంగా మృగాలుగా మారి వ్యవహరించడం బాధాకరం అని పేర్కొన్నారు. ఈ ఘటనకు కారకుడైన వనమా రాఘవను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
మానవ మృగానికి టీఆర్ఎస్ వత్తాసుగా నిలవడం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కుమారుడు ఇన్ని అరాచకాలు చేస్తుంటే సీఎం కేసీఆర్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది ? అని నిలదీశారు. ఇంటెలిజెన్స్ మొత్తం ప్రతిపక్షాల ప్రజాపోరాటలపై నిఘాకే పరిమితమైందా ? అంటూ రేవంత్ ఫైర్ అయ్యారు. ఘటన జరిగి 3 రోజులైనా చర్చలెందుకు తీసుకోలేదని అడిగారు. వనమా రాఘవ మాఫియాను మించిపోయారని ఆరోపించారు. మధ్య తరగతి కుటుంబాలను పట్టి వేధిస్తున్న, పీడిస్తున్న ఘటనలకు ఇది ఉదాహరణ అని అన్నారు. ఆ కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు.