ఉమ్మడి ఖమ్మం, ప్రభన్యూస్ బ్యూరో: నిరుద్యోగులు, విద్యార్థుల జీవితాలతో కల్వకుంట్ల కుటుంబం చెలగాటమాడు తోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో 1 లక్షా 7 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే.. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఈ తొమ్మిదేళ్లలో 2 లక్షల వరకు ఖాళీలు పెరిగాయని పేర్కొన్నారు. ఇంటికో ఉద్యోగమని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆయన దుయ్యబట్టారు. టీఎస్‌పీఎస్సీ, పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీలతో నిరుద్యోగులు, విద్యార్థులు ఆందోళనతో ఉన్నారని, బార్లు, కూరగాయల కొట్టు వద్ద ప్రశ్నాపత్రాలు దొరుకుతున్నాయని ఆరోపించారు. ఖమ్మంలో నిర్వహించిన నిరుద్యోగ నిరసన గర్జనకు సభకు డీసీసీ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మహ్మద్ జావీద్ అధ్యక్షత వహించగా, రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజర య్యారు. సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ… కేసీఆర్‌ను గద్దె దించడానికి నిరుద్యోగులంతా కలిసి రావాలని పిలుపునిచ్చా రు. నిరుద్యోగ, విద్యార్థులు చేసే పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి కొట్లాడుతోందన్నారు. ”ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్‌ను ఖమ్మం నుంచే మొదలు పెట్టాం. అదిలాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డితో పాటు మే మొదటి వారంలో సరూర్‌నగర్ స్టేడియంలో లక్షలాద మందితో భారీ బహిరంగ సభ ఉంటుంది. ఈ సభకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరువుతున్నారు. ఈ జిల్లా నుంచి కూడా వేలాది మంది నిరుద్యోగ యువత, విద్యార్థులు హాజరుకావాలి’ అని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉద్యమం ఖమ్మం నుంచే మొదలు..
తెలంగాణ నినాదం ఖమ్మం జిల్లా నుంచి మొదటగా వినిపించిందని, 1969లో కొత్తగూడెం థర్మల్ పవర్ ప్రాజెక్టు కోసం అప్పటి ప్రభుత్వం భూ సేకరణ చేసి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే.. ఇక్కడి నుంచే తెలంగాణ ఉద్యమం మొదలైందన్నారు. ఆ తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమం కూడా ఖమ్మం నుంచే ప్రారంభమైందని రేవంత్‌రెడ్డి తెలిపారు. పోడు భూములు, విద్యార్థులు, గిట్టుబాటు ధరల కోసం పోరాటాలు జరిగాయని, పోరాటం చేసిన అని చెప్పుకునే వాళ్లు ఎవరి పక్షం నిలబడ్డారో చెప్పండి అంటూ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని ఇంతకు ముందే ఎల్బీనగనర్ చౌరస్తాలోని శ్రీకాంతచారి విగ్రహం వద్ద జంగ్ సైరన్ చేపట్టామని ఆయన వివరించారు. ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబడితే 80వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చి.. ఇప్పుడు ప్రశ్నాపత్రాల లీకేజీలతో ఉద్యోగాల భర్తీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని, ఈ ప్రాంతానికి చెందిన సాగర్ అనే వ్యక్తి రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ యువత ఆత్మబలిదానాలు చేసుకుని రాష్ట్రం సాధించుకుంటే.. ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. టీఎస్‌ఎస్సీలో చదువుకున్న వాళ్లతో నింపకుండా బర్లు, గోర్లకాడికి పోయినళ్లతో నింపారని అన్నారు. టీఎస్‌పీఎస్సీలో 30 లక్షల మంది నిరుద్యోగులు నమోదు చేసుకున్నారని, ప్రశ్నాపత్రాల అమ్మకాలకు సంబంధించి పంపకాల్లో తేడాలు రావడంతోనే ప్రశ్నాపత్రం బయటికి వచ్చిందన్నారు. దొంగతనం చేసినా వాడిని పక్కన పెట్టి.. ప్రశ్నిస్తే తనకు సిట్ నోటీసు ఇచ్చిందన్నారు. ఇప్పటి వరుకు తనపై 130 కేసులు పెట్టారని, ఇంకో కేసు పెరుగుతోందన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న కాంగ్రెస్, కమ్యునిష్టు పార్టీలపై కేసులు పట్టారని రేవంత్‌రెడ్డి వివరించారు.
ఖమ్మంలో పదికి పది మనమే గెలవాలి
ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లిd నియోజక వర్గాలకు గాను 10 అసెంబ్లిd స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, అందుకు ప్రతి కార్యకర్త సిద్ధమా..? అని పార్టీ శ్రేణులకు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. గత రెండు పర్యాయాలు కూడా 10 అసెంబ్లిd స్థానాలకు 9 మంది కాంగ్రెస్‌కు చెందిన వారే గెలుపొందారని ఆయన గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జిల్లా ప్రజలు అసెంబ్లిdకి పంపిస్తే.. మిగతా 100 స్థానాలకు గాను 90 మందిని గెలిపించే బాధ్యతను తామందరం తీసుకుంటామన్నారు.
ఈ సభలో మాజీ కేంద్ర మంత్రులు రేణుకాచౌదరి, పోరిక బలరాం నాయక్, పీసీసీ మాజీ అధ్యక్షులు వి.హన్మంతరావు మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సంభాని చంద్రశేఖర్, మాజీ ఎంపీ మల్లు రవి, ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్, శివకుమార్‌రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే, కొత్తగూడెం డీసీసీ అధ్యక్షులు పోడెం వీరయ్య, ఖమ్మం సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావీద్, మానవతారాయ్ తదితర నేతలు ప్రసంగించారు. ఈ పాదయాత్ర ర్యాలీ, సభలో పీసీసీ నాయకులు వేం నరేందర్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఎడవల్లి క్రిష్ణ, ఖమ్మం సిటీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగండ్ల దీపక్‌చౌదరి, ఎండీ ముస్తాఫా, షేక్ చోటేబాబా, మానుకొండ రాధాకిషోర్, పోటు లెనిన్, కార్పోరేటర్లు మిక్కిలినేని మంజుల నరేందర్, ఎండీ రఫీదా భేగం, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య తదితరులు పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ చేపట్టిన నిరుద్యోగుల నిరసన ర్యాలీ భారీగా నిరుద్యోగులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనడంతో సక్సెస్ అయ్యింది. ర్యాలీలో అగ్రభాగాన రేవంత్‌రెడ్డి నిరుద్యోగులు, పార్టీ శ్రేణులతో కలిసి నడుస్తూ సీఎం కేసీఆర్‌కు ఇక ఇంటిదారి పట్టదని, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్ నినాదాలతో హోరెత్తించారు. రోడ్డు షో బహిరంగ సభలో ఓపెన్ టాప్ వాహనంపై నిలబడి రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.