Friday, November 22, 2024

Revanth Reddy and Bhatti – స‌వాళ్ల‌కే వారు స‌వాల్ .. అద్వితీయ ద్వ‌యం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పోరు నష్టం పొందు లాభం… ఇది కాంగ్రెస్‌కు అద్దినట్టు సరిపోతుంది! ఎన్నికలు వస్తే చాలు లెక్కకు మిక్కిలిగా ఉన్న గ్రూపులు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ఒక్కటైపోతాయి! అప్పటివరకూ ఎవరే గ్రూపులో ఉన్నారో, ఎందుకు కొట్లాడుకుంటున్నారో తెలియని నేతలు హఠాత్తుగా ఐక్యతా రాగం వినిపిస్తారు. బహుశా ఇది ఏ పార్టీలోనూ సాధ్యం కాదు… ఒక్క హస్తం పార్టీలో తప్ప! ఎడముఖం పెడముఖంగా ఉన్న నేతలంతా ఒకే వేదికపైకి వచ్చి చేయి చేయి కలిపి హృదయానికి హత్తేసుకోవడం కనిపిస్తుంటుంది!


తమ పార్టీలో స్వేచ్ఛ కాస్త ఎక్కువని ఆ పార్టీ నేతలే తరచూ జోకులు పేల్చుకుంటుండటం మామూలే. ఈ తరహా సంస్కృతి దేశవ్యాప్తంగా ఉంటుంది. ప్రతి రోజు దెబ్బలాడుకోవడం, ఊరు నుంచి పక్కనున్న పట్నం వెళ్లినంత ఈజీగా నేతలు హస్తిన చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లిd ఎన్నికలు వచ్చాయి. అప్పటివరకూ ఊరూ వాడా గడబిడలతో నిండి ఉన్న కాంగ్రెస్‌లో ఒక్కసారిగా మార్పు వచ్చింది! ముందు గెలుద్దాం… తర్వాత చూసుకుందాం! …అన్నట్టుగా మళ్లిd ఒకే తాటి పైకి నేతలు వచ్చారు… శ్రేణుల్లో ఉత్సాహం నింపారు!


ఈసారి తెలంగాణలో ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది… భారాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పటికే రెండు పర్యాయాలు అధికారం చేపట్టారు. తనదైన విశిష్ట శైలిలో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అజరామరంగా నిర్వహించారు… ఇంకా కొనసాగిస్తున్నారు. అదే సమయంలో భాజపా, కాంగ్రెస్‌లు భిన్న రీతుల్లో అధకారపార్టీపై విరుచుకుపడుతున్నాయి. ఒక దశలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయం తామంటే తామేనంటూ సవాళ్లు విసురుకున్నాయి. అయితే, కొన్ని కారణాంతరాలతో కమల వికాసం ఆగిపోయి… ధీటైన పొజిషన్‌ నుంచి దిగజారింది! అప్పటకే పీసీసీ అధ్యక్ష పదవిలో యువతను ఉర్రూతలూగిస్తూ ముందుకు సాగుతున్న రేవంత్‌ రెడ్డి, ఎంతో హుందాగా, సీనియర్‌ రాజకీయవేత్తగా రాణిస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కల నేతృత్వంలో కాంగ్రెస్‌ ఒక ప్రణాళిక ప్రకారం భారాసకు ప్రత్యామ్నాయ పార్టీగా కలబడి నిలబడింది!


తెలంగాణ ప్రజానీకం కూడా ఎంతో ఆసక్తికరంగా భాజపా, కాంగ్రెస్‌లలో ఎవరు ప్రత్యామ్నాయంగా ఆవిర్భవిస్తారోనని ఎదురుచూశారు. గత ఉదాహరణలను పరిశీలించినా భారాసకు పోటీలో నిలిచి, గెలుస్తారనుకున్న అభ్యర్థులకే ఓట్లేసి గెలిపించిన ఉదంతాలు ఉన్నాయి. దుబ్బాక, హుజూరాబాద్‌, జీహెచ్‌ఎంసీ ఎన్నికలను పరిశీలిస్తే ఇద స్పష్టమవుతుంది. కచ్చితంగా భారాసకు ధీటైన ప్రత్యామ్నాయం అనుకున్నవారికే ఓటేశారు. గత పార్లమెంటు ఎన్నికల్లోనూ అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీ అభ్యర్థుల్లో ఆయా స్థానాల్లో ఎవరు బలంగా ఉంటే వారికే ఓట్లేయడం గమనార్హం!

- Advertisement -


భారాసకు నిజమైన ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించడానికి కాంగ్రెస్‌లో దిగ్గజ ద్వయం రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్కల కృషి అనన్యసామాన్యం. ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని రేవంత్‌రెడ్డి చేపట్టారు. ఆ తర్వాత ఎన్నో ఒడిదొడుకులు… గ్రూపుల అసంతృప్తి, అసమ్మతి రాగాలు… అలకలు, ఫిర్యాదులు! తమ వర్గానికి పార్టీ పదవులు ఇవ్వలేదని, తమ స్థాయికి తగిన పదవి ఇవ్వలేదంటూ రోజుకో రీతి, పూటకో పద్ధతిలో నిరసనలు. గాంధీభవన్‌ నిరసనల భవన్‌గా మారిపోయింది. ప్రతి ఒక్కరిని అనునయిస్తూ, గదమాయిస్తూ తనదైన శైలిలో రేవంత్‌రెడ్డి పరిస్థితులను ఒక్కొక్కటిగా చక్కదిద్దారు… అదే సమయంలో పదునైన ప్రసంగాలు, విమర్శలతో యువతను ఆకట్టుకున్నారు. తెతెదేపా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు కలిసి వచ్చింది. అటు తెదేపా అభిమానులు, సెటిలర్లు కూడా రేవంత్‌లో తమ భవిష్యత్‌ నేతను చూసుకున్నారు!


ఎన్నో అవమానాలను దిగమింగి శ్రేణుల అభిమానాన్ని రేవంత్‌ చూరగొనగలిగారు… రేపు తప్పకుండా కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురాగల సమర్ధుడన్న నమ్మకాన్ని కుదర్చగలిగారు. దీంతో డిపాజిట్ల గల్లంతు స్థాయి నుంచి భారాసకు నిజమైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనన్న స్థాయికి తీసుకువెళ్లగలిగారు. కీలక నేతలు చేతులెత్తేసిన వేళ… నేడు ప్రతి సర్వేలోనూ కాంగ్రెస్‌ దూసుకువస్తోందన్న స్థాయికి పార్టీ ప్రతిష్టను పెంచగలిగారని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇక కచ్చితంగా భారాసతో కలబడి నిలబడగలిగేది కాంగ్రెస్సేనన్న అంచనాలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.


ఇక రాజకీయాల్లోనే పెద్దమనిషిగా పేరుపొందిన సీఎల్పీ నేత గురించి ఎంత చెప్పనా తక్కువే అవుతుంది. అసెంబ్లిdలో కాని, వెలుపల కాని, ప్రచారంలో కాని, పరిస్థితి ఏదైనా ఆయన నిబ్బరం కోల్పోరు… సంయమనం ఆయన నైజం… ఆత్మవిశ్వాసం ఆయన ప్రతి కదలికలోనూ కనిపిస్తుంది! ఇంత మర్యాద, మన్ననలను పొందిన నాయకులు కాంగ్రెస్‌లో అతి తక్కువమంది! వారందరిలో ముఖ్యంగా చెప్పుకోవలసింది భట్టి విక్రమార్క అంటే అతిశయోక్తి కానే కాదు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన తనదైన శైలిలో సీఎల్పీ నేతగా రాణించారు. అధికారపక్షం నుంచి ఎంత కవ్వించినా, సవాళ్లు ఎదురైనా ఆయన చిరునవ్వే సమాధానంగా చెప్పేవారు. పైగా తనకు లభించిన సమయాన్ని చక్కగా విశ్లేషణలు, గణాంకాలతో వివరించి అధికార పక్షం పొరపాట్లను ఎత్తి చూపించేవారు. కొన్ని సందర్భాల్లో అధికారపక్షం నుంచి కూడా ఆయనకు ప్రశంసలు రావడమే ఇందుకు నిదర్శనం.
ఇంత నిజాయితీ, నిబద్దత కలిగిన నేత కాబట్టే ఆయన పాదయాత్రను ప్రకటించగానే శ్రేణులు ఒక్కసారిగా కదిలివచ్చాయి. మండుటెండల్లో సైతం ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా పల్లెలు, పొలాలతో పాటు అన్ని ప్రాంతాలను చుట్టేసి అందరివాడుగా ఆప్యాయతానురాగాలను సొంతం చేసుకున్నారని రాజకీయ పండితులే ఒప్పుకుంటున్నారు. ఒక ఎస్సీ నేతగా కాకుండా రాష్ట్రస్థాయి నేతగా ఆయన పొందిన గుర్తింపు కాంగ్రెస్‌లో ఒక అపూర్వ అధ్యాయంగా పేర్కొంటున్నారు. జరుగనున్న ఎన్నికల్లో కచ్చితంగా ఆయన ప్రభావం ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. సామాజికవర్గాల నుంచే కాకుండా నైతిక విలువలు, సంప్రదాయ రాజకీయాలకు విలువనిచ్చే వారందరి మద్దతు తప్పకుండా ఆయనకు తద్వారా కాంగ్రెస్‌కు లభిస్తుందని విశ్లేషిస్తున్నారు. ఎవరెన్ని మాట్లాడినా హస్త విలాప పొజిషన్‌ నుంచి హస్త వికాస చర్చ వరకూ కాంగ్రెస్‌లో వచ్చిన ప్రతి మార్పు ఆ ఇద్దరి కష్ట ఫలితమేనని కాంగ్రెస్‌ కేడర్‌ ముక్తకంఠంతో గొంతెత్తి చాటడం వారి కష్టానికి తగిన గౌరవంగా భావించవచ్చు.
నవంబర్‌ 30న జరిగే కురుక్షేత్ర సమరంలో కాంగ్రెస్‌ గెలుపు తీరాలకు చేరినా లేదా పోరులో నాలుగడుగుల వెనుక ఆగినా ఆ ఘనత మాత్రం వీరిద్దరిదేనని రాజకీయా పండితుల నిస్సందేహ అభిప్రాయం! దేశంలోనే మహోన్నత స్థానంలో ఉన్న భాజపాను రాష్ట్రంలో వెనక్కినెట్టి రేసులో ముందుకు వచ్చి అధికార భారాసను డీకొడుతున్న కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తెచ్చిన ఘనత నిస్సందేహంగా వీరిదే.

Advertisement

తాజా వార్తలు

Advertisement