Saturday, November 23, 2024

బ‌రాబ‌ర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్ గేట్లు బ‌ద్ద‌లు కొడ‌తాంః రేవంత్ రెడ్డి

అధికారంలోకి వస్తాం
ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తాం
భూ దందాలపై విచారణ చేస్తాం
పోడుభూములకు పట్టాలిస్తాం
రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

ఉమ్మడి వరంగల్‌, ప్రభన్యూస్‌బ్యూరో: ”అమరుల త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో రూ.2 వేల కోట్లతో 150 గదులతో నిర్మాణం చేసుకున్న ప్రగతి భవన్‌కు ఉద్యమకారులకు, మేధావులకు, ప్రతిపక్ష నాయకులకు అనుమతి లేదు. ఆంధ్రా కాంట్రాక్టర్ల ప్రవేశానికి ఎర్రతివాచీలు వేసి స్వాగతం పలుకుతున్న ప్రగతి భవన్‌ గేట్లను బరాబర్‌ బద్దలు కొడతాం” అని పీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవేంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ములుగు సభలో ప్రగతి భవన్‌ను డైనమెట్లు పెట్టి పేల్చివేయాలంటూ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా, మళ్లి అదే చెబుతున్నా. ప్రగతి భవన్‌ గేట్లను బద్దలు కొట్టడం ఖాయం… కాంగ్రెస్‌ జెండాను ఎగురవేయడం ఖాయమని రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. అధికారంలోకొచ్చిన వెంటనే ప్రగతి భవన్‌ పేరును దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు విద్యనందించే అంబేద్కర్‌ విజ్ఞాన కేంద్రంగా పేరుమార్చి డాక్టర్లను, లాయర్లను, శాస్త్రవేత్తలను తయారు చేస్తామన్నారు. ఉమ్మడివరంగల్‌ జిల్లాలో మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ నియోజకవర్గంలోని నర్సింహులపేట, మరిపెడ మండలాల్లో పాదయాత్రను నిర్వహించారు. ఈ సందర్బంగా మరిపెడలో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకివచ్చిన తర్వాత సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో కేటీఆర్‌ చేసిన భూ దందాలపై విచారణ చేసి బొక్కలో తోస్తామని హెచ్చరించారు. ధరణి పోర్ట్‌ల్‌ను అడ్డంపెట్టుకొని అక్రమంగా చేసిన భూ దందాను వెలికితీస్తామని, అప్పనంగా కాంట్రాక్టర్లకు దారదత్తం చేసిన వేల ఎకరాల భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని రేవేంతర్‌రెడ్డి అన్నారు.



రాక్షస పాలనను అంతంచేయడమే పాదయాత్ర లక్ష్యం
రాష్ట్రంలో ల్యాండ్‌, శ్యాండ్‌ మాఫియాను ప్రోత్సహిస్తూ భూ దందాలను చేస్తున్న పాపాల బైరవుడు కేసీఆర్‌ రాక్షస పాలనను అంతం చేసేందుకోసమే పాదయాత్ర చేపట్టినట్లు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను రద్దుచేస్తాం.. 2006 అటవీహక్కుల చట్టం ప్రకారం ఆదివాసీ, గిరిజన బంజారులకు అర్హులైన వారికి పట్టాలు అందిస్తామని, 2 లక్షల రూపాయల రుణాలను మాఫీచేస్తాం… పేదలకు వైద్యం అందించే ఆరోగ్యశ్రీ ట్ర స్టుకు రూ.800 కోట్ల బకాయిలు చెల్లిస్తాం.. ఫీజు రీయంబర్స్‌ మెంట్స్‌కు ఇవ్వాల్సిన రూ.5 వేల కోట్ల బకాయిలను చెల్లించి కౌలు రైతులకు ఏటా రూ.15 వేల సహాయం చేస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో డోర్నకల్‌లో కాంగ్రెస్‌ పార్టీజెండా ఎగురవేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 6న మేడారంలో ప్రారంభించిన హా త్‌సే హాత్‌ జోడో అభియాన్‌ యాత్ర ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ముగిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement