Wednesday, November 20, 2024

Revanth First Step – సీఎం రేవంత్ రెడ్డిగా తొలి అడుగు ..ప్రగతి భవన్ రండి… ఆకాంక్షలు, ఆలోచనలు పంచుకోండి

హైద‌రాబాద్ – తెలంగాణకు పట్టిన చీడ పీడ వదిలింది. ఇక్కడ ప్రమాణం చేస్తున్న సమయంలో అక్కడ ప్రగతి భవన్ చుట్టూ ఇనుప కంచెను బద్దలు కొట్టించాం. ఇక ఎవరైనా ప్రగతి భవన్కు రావచ్చు. నిరుపేదలు, నిస్సహాయకులు అనే తేడా లేదు. రేపు ఉదయం 10.00 గంటలకు నిర్వహించే జ్యోతిరావు పూలే దర్బార్కు అందరూ రావచ్చు. మీ ఆకాంక్షలు, ఆలోచనలు పంచుకోవచ్చు, అని తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో తాను ఇచ్చిన ఆరు హామీల అమలుకు అభయహస్తం చట్టాన్ని చేసే ఫైలుపై తొలి సంతకం చేశారు. అదే విధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామనే హామీని నెరవేర్చే ముందు ఓ దివ్యాంగురాలు కుమ్మరి రజనికి ఉద్యోగ నియామ పత్రంపై సంతకం చేసి.. ఆ పత్రాన్ని దివ్యాంగురాలికి అందజేశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచ దేశాలతో ధీటుగా తెలంగాణను అభివృద్ధి పథంలో నడపటమే కాదు, పేదలు, నిస్సహాయకులు తమకు ఎవరూ దిక్కులేరనే బాధపడొద్దు, మీ బిడ్డగా, మీ సోదరుడిగా మీరు నాకు ఇచ్చిన బాధ్యతలు నెరవేస్తానని తెలంగాణ సీఎం ఎనుమల రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. గడచిన పదేళ్లల్లో తెలంగాణలో ప్రజాస్వామ్యం హత్యకు గురికాగా.. మానవహక్కులు లేవు, ప్రజలు తమ బాధను చెబితే వినే ప్రభుత్వం లేదు, దశాబ్ధకాలం ప్రజలు మౌనం పాటించారు, ఇలాంటి స్థితిలో ఇందిరమ్మ రాజ్యంలోనే మానవ హక్కులను కాపాడగలమని సోనియమ్మ ఉక్కు సంకల్పం, ఉద్యమకారుల ఆకాంక్షను నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ సమిధగా మారి పోరాడిందన్నారు. మీరు ఇచ్చిన ఈ అవకాశంతో మేము పాలకులం కాదు, సేవకులం, మీకు సేవ చేయటమే మా బాధ్యత, ఈ అవకాశానికి గౌరవం కాపాడుతూ, తెలంగాణ అభివృద్ధికి, పేదల సంక్షేమానికి కట్టుబడుతామని రేవంత్ రెడ్డి ఉద్వేగంగా అన్నారు.

తెలంగాణలో ప్రజారాజ్యం, సంక్షేమ రాజ్యం స్థాపనకు రేవంతన్నగా మీకు మాట ఇస్తున్నా, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యమకారులు, అమర వీరుల కుటుంబాల ఆకాంక్షలను నెరవేరుస్తానని వివరించారు. ఇందిరమ్మ రాజ్యంలో సామాజిక న్యాయం, సమానత్వం , సమాన అభివృద్ధి ఖాయం అన్నారు. ఆసిఫాబాద్ నుంచి అలంపూర్ వరకూ, ఖమ్మం నుంచి కొడంగల్ వరకూ అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి ఉంటుందని, సోనియా గాంధీ ఆశీస్సులతో, మల్లిఖార్జున్ ఖర్గే నాయకత్వంలో, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సూచనలతో తెలంగాణలో ప్రజారాజ్యం వెల్లివిరస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం పదేళ్లు కష్టాలను అనుభవించి, మూడు రంగుల జెండాను భుజాన మోసిన లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారని, వీరి కష్టాన్ని గుండెల్లో ఉంచుకుంటా, ఎప్పుడు వచ్చి మీ కష్టాన్ని చెబితే తక్షణమే స్పందిస్తానని కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement