Sunday, November 10, 2024

TG: రుణ‌మాఫీపై రేవంత్ ద‌గా.. జ‌గ‌దీష్ రెడ్డి

రైత‌న్న‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల్సిందే
సగం మందికి కూడా రుణ మాపీ కాలేదు
పూర్తి చేశామంటున్న రేవంత్ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయాల్సిందే
డిమాండ్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీష్ రెడ్డి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – రుణ‌మాఫీ విష‌యంలో రైతులను మోసం చేసినందుకు రేవంత్‌ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని, వారికి వెంట‌నే క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జ‌గ‌దీష్ రెడ్డి. రుణమాఫీపై ఒక్కో మంత్రి ఒక్కోవిధంగా మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. రుణమాఫీ కాని రైతులు ఎక్కడ ఫిర్యాదు చేయాలో స్పష్టత లేదన్నారు. తమకేం తెలియదని అధికారులు, బ్యాంకు సిబ్బంది చెబుతున్నారని వెల్లడించారు. అసలు ఎంతమందికి మాఫీ చేస్తరు.. ఇప్పటివరకు ఎంతమందికి చేశారో చెప్పాలన్నారు. మిగిలిన వారికి ఏ తేదీలోగా మాఫీ చేస్తారో స్పష్టం చేయాలన్నారు.

తెలంగాణ భ‌వ‌న్ లో ఆయ‌న ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… అందరికీ రుణమాఫీ చేయలేదని మంత్రులే చెబుతున్నారన్నారు. బ్యాంకుల లెక్కప్రకారం 50లక్షల మందికిపైగా రైతులకు సంబంధించి రూ.49వేల కోట్లు రుణాలున్నాయ‌ని, అయితే మంత్రులు మాత్రం రూ.31వేల కోట్లు మాఫీ చేస్తామని చెప్పారు. ఇప్పటివరకూ రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య స్పష్టంగా చెప్పట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా 15లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని మంత్రి ఉత్తమ్‌ చెబుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి మాత్రం రైతులందరికీ రుణాలు మాఫీ చేశామంటూ డ్యాన్స్‌ చేస్తున్నారని విమర్శించారు. మరి ఇప్పుడు ముక్కు నేలకు రాయాల్సింది ఎవరని ప్రశ్నించారు.

- Advertisement -

ప్రతిప‌క్షంగా ఇంకా ప‌ని మొద‌లు కాలేదు ..

ప్రతిపక్షంగా ఇంకా తమ పని మొదలుపెట్టలేదని జగదీశ్‌ రెడ్డి అన్నారు. దగాపడ్డ రైతులే స్వయంగా రోడ్డెక్కుతున్నారని తెలిపారు. ఆందోళన చేస్తున్న రైతులను కేసులతో భయపెడుతున్నారని విమర్శించారు. రూ.2లక్షలకు మించి ఉన్న రుణం కడితేనే మాఫీ చేస్తామంటున్నారని, ప్రభుత్వం రూ.2లక్షలు మాఫీ చేస్తే మిగతావి రైతులే కట్టుకుంటారని వెల్లడించారు. రైతులపై దమనకాండకు పాల్పడితే బీఆర్‌ఎస్‌ చూస్తూ ఊరుకోదు. రైతులకు అండగా తమ పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు. రుణమాఫీపై కాంగ్రెస్‌ సర్కార్‌ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

రాజీవ్ విగ్ర‌హం తొల‌గింపు ఖాయం ..

బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినతర్వాత సెక్రటేరియట్‌ వద్ద రాజీవ్‌ గాంధీ విగ్రహం తొలగిస్తామ‌ని తేల్చి చెప్పారు జ‌గ‌దీష్ రెడ్డి. రాజీవ్‌ గాంధీకి తెలంగాణతో సంబంధం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మ లేనివాళ్లు అధికారంలో ఉన్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల అభిప్రాయం మేరకు అక్కడ తెలుగుత‌ల్లి విగ్రహం పెడతామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement