- కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
- రైతుభరోసా, కొత్త రేషన్ కార్డులు మంజూరుపై చర్చ
- యాదగిరిగుట్ట పాలక మండలిపై తుది నిర్ణయం
- ఇందిరమ్మ ఇండ్ల పంపిణీపై చర్చ
- బీసీ రిజర్వేషన్ లపై కూడా ప్రస్తావన …
హైదరాబాద్: తెలంగాణ మంత్రిమండలి సమావేశం నేటి సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగనుంది. ఈ సందర్భంగా రైతుభరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి కోసం టీటీడీ తరహాలో ప్రత్యేక పాలక మండలి ఏర్పాటు వంటి అంశాలపై చర్చించనున్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సబ్సిడీకి ఇసుక, సిమెంట్, స్టీలు వంటి నిత్యావసరాలు సరఫరా చేసే ప్రతిపాదనపై కేబినెట్ చర్చింనుంది.
అదేవిధంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయడానికి ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్‌కు అవసరమైన గణాంకాలను అందించే అంశంపై కూడా మంత్రిమండలి నిర్ణయం తీసుకోనుంది. రైతు భరోసాకు వివిధ ఆంక్షలు విధిస్తూ క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన సిఫారసులను మంత్రిమండలి చర్చించి ఆమోదించనున్నది. భూమి లేని కూలీలకు ఏటా రూ.12వేలు ఆర్థిక సాయం అందించే అంశంపై కూడా చర్చించి ఆమోదించనున్నట్టు తెలుస్తున్నది. భూ భారతి బిల్లు ప్రకారం వీఆర్వో వ్యవస్థ ఏర్పాటుకు సైతం ఆమోదం తెలుపనున్నది. వీఆర్వోలు, సర్వేయర్ల నియామకంపై చర్చించనున్నది.