తెలంగాణలో పెట్టుబడుల కోసం ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానిని కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇక్కడ అదానిపై నిప్పులు చెరుగుతారు..అక్కడే అతడితో రేవంత్ సమావేశాలవుతారంటూ మాజీ మంత్రి కెటిఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, దావోస్ లో ముఖ్యమంత్రి రేవంత్ చొరవ తీసుకుని వేలాది కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొస్తుంటే ఓర్వలేక బిఆర్ ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని మండి పడ్డారు.
హైదరాబాద్ లో ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అనేక హామీలు ఇచ్చిందని.. అందులో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించిందనందుకే ప్రజలు బీఆర్ఎస్‌ను ఓడించారని అన్నారు. గతంలో ప్రతిపక్షాలు బీఆర్ఎస్‌ను రెండేళ్ల తర్వాత విమర్శిస్తే.. రెండేళ్ల పసికందును విమర్శిస్తారా? అని వాపోయినట్లు గుర్తుచేశారు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చే బీఆర్ఎస్‌ను తరిమి కొట్టారని అన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని జీర్ణించుకోలేక రెండు నెలలకే విమర్శలు ప్రారంభించారని మండిపడ్డారు. 2014లో బంగారు పళ్లాన్ని ప్రజలు కేసీఆర్ చేతిలో పెడితే.. అప్పుల కుప్పగా మార్చాడని విమర్శించారు. రహస్యంగా జారీ చేసిన ఎన్నో జీవోలను బీఆర్ఎస్ బహిర్గతం చేయలేదని అన్నారు. తొమ్మిదేళ్లలో రూ.7 లక్షల కోట్ల అప్పు చేసిందని తెలిపారు. కేసీఆర్ పుణ్యమా అని ఇవాళ రూ.40 వేల కోట్లు వడ్డీకే పోతోందని అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో అధికారంలోకి వచ్చిన రెండ్రోజుల్లోనే రెండు అమలు చేశామని.. మిగతా నాలుగు గ్యారంటీల అమలు కోసమే ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. త్వరలోనే మిగిలిన హామీలను కూడా అమలు చేస్తామని వెల్లడించారు మంత్రి జూపల్లి.