- గిరిజన బాలికకు అండగా ముఖ్యమంత్రి
- పేదరికంతోనే ఎంబీబీఎస్ సాధించిన సాయి శ్రద్ద
- ఫీజు కూడా చెల్లించలేని ఆర్ధిక దుస్థితిలో కుటుంబం
- నెటిజన్ ద్వారా తెలుసుకున్న రేవంత్
హైదరాబాద్ – కుమురంభీం జిల్లాకు చెందిన గిరిజన బాలిక సాయిశ్రద్ధకు వైద్య విద్య కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. కుమురంభీం జిల్లా జైనూరు మండలం జెండాగూడ గ్రామానికి చెందిన గిరిజన బాలిక సాయిశ్రద్ధ ఎంబీబీఎస్ లో సీటు సాధించినా కాలేజీ ఫీజు కట్టేందుకు ఆర్ధిక స్థోమత లేక ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటోంది. ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుకొని నీట్లో సీటు సంపాదించి ఆర్థిక స్థోమత సరిగా లేని కారణంగా చదువు మధ్యలోనే ఆపేయాల్సి వస్తోందని బాలిక తల్లిదండ్రులు వాపోయారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తమ బిడ్డ డాక్టర్ అయ్యేందుకు సహకరించాలని కోరారు.
ఈ మేరకు ఓ నెటిజన్ ట్విట్టర్లో పోస్ట్ చేయగా.. సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. డాక్టర్ కావాలనుకుంటున్న ఆ బాలికకు భరోసా ఇస్తున్న అంటూ స్పెషల్ పోస్ట్ చేశారు. తన దృష్టికి వచ్చిన వెంటనే డాక్టర్ కావాలన్న ఆ అమ్మాయి కల నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చి రేవంత్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. వైద్య విద్యకు అవసరమైన ఫీజుతో పాటు ఇతర ఖర్చుల కోసం చెక్ ను అందజేశారు రేవంత్. ఈ సందర్భంగా సీఎంకు సాయిశ్రద్ద, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.