- ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తున్నా ఇచ్చిన హామీలు ఏమయ్యాయి.
- కేటీఆర్ నార్కో పరీక్షలకు సిద్ధం అన్నావు.. మరి ఎందుకు ఆలస్యం
ఇందల్వాయి, నవంబర్ 13 (ఆంధ్రప్రభ) : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఏజెంట్ లాగా పనిచేస్తున్నాడని, కానీ పరోక్షంగా కేసీఆర్ తో లోపాయి గారి ఒప్పందం చేసుకొని, కేసీఆర్ కు బినామీగా రేవంత్ రెడ్డి మారారని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఆయన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం రైతులతో నేరుగా మాట్లాడుతూ… వారి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఒక కాంటా వరి ధాన్యాన్ని తూకం వేయడానికి ఒకటిన్నర కిలోలు వడ్లను కడతా పేరుతో అక్రమంగా తీసుకుంటున్నారని రైతులు ఎంపీ ధర్మపురి అరవింద్ దృష్టికి తేగా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుజాడల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నాడని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజలు దిమ్మతిరిగే తీర్పు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసిన పనులను చేస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని జోష్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా రైతులకు రైతుబంధు, రైతు రుణాల మాఫీ, 4000 పింఛన్, ఇందిరమ్మ ఇండ్లను ఎవరికి ఇచ్చారని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన హామీలు అన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేలాది టన్నుల వరి ధాన్యం ఇంకా అందుబాటులో ఉన్న ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు.
త్వరితగతిన వరి ధాన్యాన్ని రైతుల నుంచి విక్రయించి తక్షణమే డబ్బులను రైతులకు అందించాలన్నారు. కేటీఆర్ ఢిల్లీలో అడుగుపెట్టిన వెంటనే తెలంగాణలో ప్రకంపనలు ప్రారంభమయ్యాయని కొందరు నేతలు, కొన్ని పత్రికలు, తన సొంత మీడియా కథనాలు వెల్లడించాయని ఆయన అన్నారు. కానీ ఢిల్లీ వెళ్లి ఎవరిని కలిశారో దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటివరకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మత్తు పదార్థాల సేవింగ్ ఎక్కువ కావడం వల్లే బాడీలో షేకింగ్ వచ్చిందని, అందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు.
కేటీఆర్ నార్కో పరీక్షలకు సిద్ధమని ప్రకటించి ఆరు మాసాలు గడుస్తున్నా ఎందుకు నార్కో పరీక్షలు నిర్వహించడం లేదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని ఆయన సవాల్ చేశారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులచారి దినేష్ కుమార్, పల్లె గంగారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు నాయుడు రాజన్న, కేపీ రెడ్డి మోహన్ రెడ్డి, మాటంలా శేఖర్, ధర్పల్లి మాజీ జెడ్పీటీసీ కార్క గంగారెడ్డి, లొలం సత్యనారాయణ, మమతా శేఖర్, బీజేపీ నిజామాబాద్ రూరల్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.