నిర్మల్ ప్రతినిధి, నవంబర్ 4 (ఆంధ్రప్రభ) : కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గులాంగిరిగా మారాడని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగారు. సోమవారం నిర్మల్ లో ఆయన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రాన్ని క్యాబినెట్ లో విభేదాలు, కాంగ్రెస్ లో కుమ్ములాటలను కట్టడి చేయలేని సీఎం రేవంత్ రెడ్డి… తమ లోపాలను, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ తో కలిసి బీజేపీని కూల్చేందుకు ప్రయత్నిస్తోందంటూ తప్పుడు ఆరోపణలు చేయించడం ముఖ్యమంత్రి దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమన్నారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర కాంగ్రెసుదేనని, బీఆర్ఎస్ తో కుమ్మక్కయింది కాంగ్రెస్సే … అందుకే ఆ పార్టీ ముఖ్యనేతలపై కేసుల్లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయంటూ మంత్రి శ్రీధర్ బాబు అవగాహన లేకుండా, అవివేకంతో నిరాధార ఆరోపణలు చేశారన్నారు. కాంగ్రెసు ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు.
మధ్యప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ లేదా ఆ పార్టీ కూటమి ప్రభుత్వాలు అంతర్గత కుమ్ములాటలతో కూలిపోయాయే తప్ప అందులో బీజేపీ ప్రమేయం ఏమాత్రం లేదన్నారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన పాపపు చరిత్ర కాంగ్రెసుదేనన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను మార్చిన చరిత్ర కూడా ఆ పార్టీదేనన్నారు. ముఖ్యమంత్రులను మార్చిన ట్రాక్ రికార్డు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డిని మార్చి మరో సీనియర్ మంత్రిని సీఎంను చేయడానికి కసరత్తు చేస్తున్నట్టు సమాచారమన్నారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెసులోకి ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలకు పార్టీ కండువా కప్పే కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రి పొంగులేటి మినహా మరో మంత్రి లేరు కదా అన్నారు. కేబినెట్ లో మొదట్నుంచి కాంగ్రెసులో కొనసాగుతున్న ఆరుగురు మంత్రులు ఒక గ్రూపుగా, సిఎంతో సహా టీడీపీ, బీఆర్ఎస్ ల నుంచి వచ్చిన మిగిలిన ఆరుగురు మరో గ్రూపు మరో వర్గంగా విడిపోలేదా … మంత్రిమండలి ఇలా నిలువునా చీలిన విషయం వాస్తవం కాదా అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి చేతనైతే కేబినెట్ లో విభేదాలు, కాంగ్రెసులో కుమ్ములాటలు లేకుండా చేసుకోవాలన్నారు. అంతేగాని కాంగ్రెసు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఉన్న లోపాలు, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రత్యర్ధి బీజేపీని బద్నాం చేయండంటూ మంత్రులను ఉసిగొల్పడం సిఎం రేవంత్ రెడ్డి అసమర్ధతకు, దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమని ఆరోపించారు.