టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ బాటలోని నడిచాడు. అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన తర్వాత రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. ‘ఇదే నా చివరి మ్యాచ్. వీడ్కోలు పలికేందుకు ఇంతకంటే మంచి సమయం ఉండదు. ఈ ట్రోఫీని ఎలాగైనా గెలవాలనుకున్నా. అనుకున్నది సాధించా. టీ20 కెరీర్‌లోని ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేశా’ అని హిట్‌మ్యాన్ అన్నాడు.
2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై ఈ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన రోహిత్.. 159 మ్యాచ్‌లు ఆడాడు. 32.05 సగటుతో 4231 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా టాప్ ప్లేస్‌లో నిలిచాడు. బౌలింగ్ కూడా చేసిన రోహిత్ ఒక వికెట్ తీశాడు.భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన తర్వాత కోహ్లీ ఈ విషయాన్ని వెల్లడించాడు.
జట్టు విజయంలో కీలకమైన నేపథ్యంలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న కోహ్లీ మాట్లాడుతూ ‘ఇది నా కెరీర్‌లో చివరి టీ20 ప్రపంచకప్. ఏదైతే సాధించాలనుకున్నామో అది అందుకున్నాం. భారత్ తరఫున టీ20ల్లో ఇదే చివరి మ్యాచ్. ఇందులో ఎలాంటి రహస్యం లేదు. టీ20లను ముందుకు తీసుకెళ్లేందుకు యువ క్రికెటర్లు సిద్ధంగా ఉన్నారు. ఐసీసీ ట్రోఫీ కోసం ఏండ్లుగా ఎదురుచూశాం. రోహిత్‌కు ఇది తొమ్మిదో టీ20 ప్రపంచకప్ అయితే..నాకిది ఆరోది. భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోతున్నాం. ఇది చిరకాలం మా మదిలో నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని అన్నాడు.
2010లో జింబాబ్వేపై టీ20 అరంగేట్రం చేసిన కోహ్లీ.. 125 మ్యాచ్‌ల్లో 48.69 సగటుతో 4188 పరుగులు చేశాడు. తన చివరి మ్యాచ్ అయిన ప్రపంచకప్ ఫైనల్లో కోహ్లినే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలవడం విశేషం.