మెదక్ ప్రతినిధి:ప్రభ న్యూస్ – కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కోసం పదేళ్లుగా పనిచేస్తున్నా కనీస గౌరవం దక్కడం లేదనే కారణంతో ఆయన రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖ రాశారు. నోట్ల కట్టలు కలిగిన పారాషూట్ నాయకులకే సీట్లు అప్పగించడమే కాంగ్రెస్ మోడల్ అని ప్రజలు విశ్వసించేలా పరిణామాలు ఉన్నాయన్నారు. జీవితాంతం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి నాయకత్వం అప్పగించడమే ఇందుకు కారణమని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అలాంటి వారి వల్ల పార్టీకి, ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.
నోట్ల కట్టలకు అమ్ముడుపోయే వారు భవిష్యత్తులో తెలంగాణ ఆత్మగౌరవాన్ని నడిబజారులో నవ్వుల పాలు చేయడం ఖాయమన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని వదిలి, కేవలం ధనబలం ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తున్నా ఎఐసిసి అగ్రనేతలైన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కూడా మౌనం వహించడం తనకెంతో బాధ కలిగించిందని ఆ లేఖలో పేర్కొన్నారు. బరువెక్కిన హృదయంతో పార్టీని వీడుతున్నానని కంఠారెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు .తన అభిమానులతో మాట్లాడి త్వరలోనే భవిష్యత్ నిర్ణయం ప్రకటిస్తానని తిరుపతిరెడ్డి స్పష్టం చేశారు.